Telepathy: మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి ఎదుటివ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుందని అనుకుంటాం. ఈ ఆలోచనే టెలీపతి అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌కు దారితీస్తుంది. టెలీపతి అంటే ఒక వ్యక్తి నుండి మరొకరికి ఆలోచనలు, భావాలు లేదా సమాచారాన్ని ఎలాంటి శారీరక సంపర్కం లేకుండా పంపడం. దీన్ని ‘మైండ్ రీడింగ్’ లేదా ‘మానసిక సంపర్కం’ అని కూడా అంటారు. ఈ భావన శాస్త్రీయంగా నిరూపితం కానప్పటికీ, సినిమాలు, సాహిత్యం, ఆధ్యాత్మిక చర్చల్లో టెలీపతి గురించి ఎక్కువగా వినిపిస్తుంది. మన ప్రాచీన సంస్కృతిలో కూడా యోగులు, గురువులు మానసిక సామర్థ్యాలు కలిగి ఉన్నారని చెప్పబడుతుంది. అయితే, టెలీపతి నిజంగా సాధ్యమా? దీని రకాలు ఏమిటి? ఈ వార్తలో తెలుసుకుందాం.
టెలీపతిలో రకాలు
ఆలోచనల బదిలీ
ఇందులో ఒక వ్యక్తి తన ఆలోచనలను మరొకరి మనసుకు పంపడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదైనా పదం లేదా సంఖ్య గురించి ఆలోచిస్తే, దాన్ని మరొకరు గ్రహించడం.
భావోద్వేగ బదిలీ
ఈ రకంలో ఒకరి మనసులోని భావోద్వేగాలు, అంటే ఆనందం, బాధ, భయం వంటివి మరొకరికి అనుభవమవుతాయి. ఉదాహరణకు, మీ స్నేహితుడు దూరంగా ఉన్నప్పటికీ అతని బాధను మీరు గ్రహించడం.
స్పృహ బదిలీ
ఇది కాస్త లోతైన రకం. ఒకరి మనసులోని దృశ్యాలు, చిత్రాలు లేదా సమాచారం మరొకరి మనసుకు చేరడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదైనా సన్నివేశాన్ని ఊహించినప్పుడు, అది మరొకరి మనసులో కనిపించడం.
ALSO READ: పారలల్ లైఫ్, మల్టీ వర్స్ అనేవి నిజంగా సాధ్యమేనా? సైన్స్‌లో ఆధారాలు ఉన్నాయా?
సైన్స్ కోణం
టెలీపతి గురించి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ, దీనికి ఖచ్చితమైన ఆధారాలు ఇంకా లభించలేదు. కొందరు సైంటిస్టులు క్వాంటం ఫిజిక్స్ ద్వారా టెలీపతి సాధ్యమని వాదిస్తున్నారు. క్వాంటం ఎంటాంగిల్మెంట్ వంటి సిద్ధాంతాలు రెండు పాయింట్ల మధ్య సమాచార బదిలీని సూచిస్తాయి, కానీ ఇవి టెలీపతిని నిరూపించడానికి ఇంకా సరిపోలేదు. మనస్తత్వవేత్తలు టెలీపతిని సహజమైన అవగాహన లేదా బాడీ లాంగ్వేజ్ ద్వారా జరిగే సమాచార బదిలీగా చూస్తారు. అయినప్పటికీ, టెలీపతి సైంటిఫికల్‌గా ఒక రహస్యంగానే మిగిలిపోయింది.
సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
మన భారతీయ సంస్కృతిలో టెలీపతి యోగా, ధ్యానంతో ముడిపడి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. పతంజలి యోగ సూత్రాల్లో ‘సిద్ధులు’ అనే మానసిక శక్తుల గురించి ప్రస్తావన ఉంది, ఇందులో టెలీపతి ఒకటిగా భావించబడుతుంది. ప్రాచీన కాలంలో యోగులు, ఋషులు ఇలాంటి సామర్థ్యాలను ధ్యానం ద్వారా సాధించారని చెప్పబడుతుంది. ఈ రోజుల్లో సైన్స్ ఫిక్షన్ సినిమాలు, నవలలు టెలీపతిని ఒక ఆసక్తికరమైన అంశంగా చూపించి, ప్రజల్లో దీనిపై ఆసక్తిని పెంచుతున్నాయి.
టెలీపతి సాధ్యమా?
కొందరు ఆధ్యాత్మికవేత్తలు ధ్యానం, ఏకాగ్రత, మానసిక సాధనల ద్వారా టెలీపతి సామర్థ్యాలను పెంచుకోవచ్చని నమ్ముతారు. దీనికి శిక్షణ, ఓపిక, బలమైన మానసిక సంబంధం అవసరమని వారు చెబుతారు. కొన్ని సార్లు ప్రేమికులు లేదా బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఒకరి ఆలోచనలు మరొకరికి అర్థమవడం వంటివి టెలీపతికి ఉదాహరణలు అని అంటారు. అయితే, ఇవన్నీ సైంటిఫిక్‌గా నిరూపితం కాకపోవడం వల్ల వీటిని కేవలం నమ్మకాలుగానే పరిగణిస్తారు.