Jio vs Airtel vs Vi: స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న చాలా మందికి డేటా అవసరం అంతగా ఉండకపోవచ్చు. కేవలం కాల్స్ మాట్లాడటానికి లేదా ఒక సెకండరీ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మాత్రమే ఫోన్ వాడేవారు కోకొల్లలు. గతంలో వీరందరూ ఇష్టం లేకపోయినా.. డేటా ప్యాక్‌లతో కూడిన రీఛార్జ్‌లే చేసుకోవాల్సి వచ్చేది. కానీ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలతో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (విఐ) కంపెనీలు కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ల కోసమే ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీనివల్ల అనవసరంగా డేటా కోసం డబ్బులు వేస్ట్ కాకుండా యూజర్లకు మంచి ఉపశమనం లభించింది.
స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ వాడని వారు, సాధారణ ఫోన్ ఉపయోగించే వారు ఈ ప్లాన్లతో డబ్బు ఆదా చేసుకోవచ్చు. రెండో సిమ్‌ను కాల్స్ కోసం మాత్రమే ఉంచుకునేవారికీ ఇవి ఉపయోగపడతాయి. వ్యక్తిగత, ఆఫీస్ కాల్స్‌కు వేర్వేరు నంబర్లు వాడేవారు కూడా ఇలాంటి రీఛార్జ్‌ను ఎంచుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలకు ప్రత్యేక నంబర్ పెట్టుకుని, దాన్ని ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచాలనుకునేవారికి కూడా ఇవి పనికొస్తాయి.
Also Read: యూట్యూబ్ యాప్‌లో భారీ మార్పులు.. సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్ మాయం.. కొత్తగా ఏమొచ్చాయంటే?
జియోలో రూ.147 ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో 300 SMSలు ఇస్తుంది. రూ.177 ప్లాన్ 28 రోజులు, రూ.196 ప్లాన్ 30 రోజుల పాటు ఇదే 300 SMSల సదుపాయం అందిస్తాయి. రూ.197 రీఛార్జ్‌కు ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులోనూ 300 SMSలు లభిస్తాయి. ఎక్కువ రోజులు రీఛార్జ్ చేయకుండా ఉండాలనుకునేవారికి రూ.448 ప్లాన్ 84 రోజుల పాటు 1,000 SMSలు ఇస్తుంది. రూ.1,748 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 3,600 SMSలు అందిస్తుంది.
ఎయిర్‌టెల్, వీఐలో రూ.185 ప్లాన్ 28 రోజులు, రూ.203 ప్లాన్ 30 రోజులు, రూ.206 ప్లాన్ ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వస్తాయి. ఈ మూడు ప్లాన్లలో 300 SMSలు ఉంటాయి. 84 రోజుల కోసం ఎయిర్‌టెల్ రూ.469, వీఐ రూ.470 వసూలు చేస్తున్నాయి. వీటిలో 900 SMSలు లభిస్తాయి. ఏడాది వ్యాలిడిటీ కోరుకునేవారికి రెండు కంపెనీల్లోనూ రూ.1,849 ప్లాన్ ఉంది. ఎయిర్‌టెల్‌లో 365 రోజులు, వీఐలో 365 రోజులు వ్యాలిడిటీతో 3,600 SMSలు వస్తాయి.
ఈ ధరలన్నీ ఇచ్చిన ప్లాన్ వివరాల ప్రకారం ఉన్నాయి. మూడు నెట్‌వర్క్‌లలోనూ కాలింగ్ అన్‌లిమిటెడ్. కాబట్టి.. మీ ప్రాంతంలో ఏ సిమ్‌కు మంచి సిగ్నల్ వస్తుంది? ఎంతకాలం రీఛార్జ్ అవసరం ఉండదు అనే విషయాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాయిస్ ఓన్లీ రీఛార్జ్‌లో మొబైల్ డేటా అందుబాటులో ఉండదు. కాబట్టి వాట్సప్, మ్యాప్స్, వీడియోలు వంటి సేవలు వాడాలంటే ప్రత్యేక డేటా ప్లాన్ అవసరం. ఈ విషయాన్ని కూడా ముందుగానే గుర్తుంచుకోవాలి. రీఛార్జ్ చేసే ముందు కంపెనీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో తాజా ధర, నిబంధనలు మరోసారి చూసుకోవడం మంచిది.
Also Read: ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!