Healthcare Training: స్వేచ్ఛ బ్యూరో: వైద్యారోగ్య శాఖలో అడ్మినిస్ట్రేషన్ ,పేషెంట్లకు అందే సేవల ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది.ప్రాథమిక కేడర్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు అందరికీ మూడు నెలల తప్పనిసరి శిక్షణ నిబంధనను అమల్లోకి తెచ్చింది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, పారా మెడికల్ సిబ్బంది వరకు ప్రతీ ఒక్కరూ ఈ శిక్షణ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా వైద్యారోగ్య రంగానికి సరికొత్త దిశానిర్దేశం లభించడమే కాకుండా, సిబ్బందిలో జవాబుదారీతనం, రెస్పాన్సిబిలిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మరింత పారదర్శకంగా వైద్య సేవలు అందించడమే ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. అంతేగాక క్లిష్ట పరిస్థితుల్లో రోగులు, వారి బంధువులతో ఎలా నడుచుకోవాలి?అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స వేగంగా అందించడం, ఐసీయూ ప్రోటోకాల్స్ అమలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ , ఆన్‌లైన్ ప్రిస్క్రిప్షన్లు, కొత్త సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి స్థాయి అవగాహన వంటివి కల్పించనున్నారు.
డాక్టర్ల నుంచి ల్యాబ్ టెక్నీషియన్ వరకు ..
ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో నియామకం పొందిన వెంటనే నేరుగా విధుల్లోకి తీసుకుంటున్నారు. కేవలం హాస్పిటల్స్ లో చేరిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో పరిమిత శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దీని వలన ఆయా స్టాఫ్ లో సంపూర్ణ అవగాహన లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇకపై ఆ పరిస్థితి లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్లకు ఆసుపత్రి నిర్వహణ, ఎమర్జెన్సీ అసిస్టెన్స్, బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ,మెడికో-లీగల్ కేసుల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. స్టాఫ్ నర్సులకు పేషెంట్ కేర్, ఆపరేషన్ కేర్, సర్జికల్ వార్డుల ఐసోలేషన్ ప్రోటోకాల్స్, ల్యాబ్ టెక్నీషియన్లు , ఫార్మాసిస్టులకు అధునాతన డయాగ్నోస్టిక్ పరికరాల నిర్వహణ, రిపోర్టు అనాలసిస్ వంటి వాటిపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
మూడు విభాగాలుగా..
స్టాఫ్ ట్రైనింగ్ లో 90 రోజుల పీరియడ్ ను మూడు విభాగాలుగా విభజించి అవగాహన కల్పించనున్నారు. మొదటి నెలలో ప్రభుత్వ విధానాలు, హెల్త్ స్కీములు, ఉద్యోగ బాధ్యతలు, పేషెంట్ హక్కులపై ట్రైనింగ్ ఉండనన్నది. రెండో నెలలో టీచింగ్ హాస్పిటల్స్ ప్రాక్టీస్ కు అవకాశం కల్పిస్తారు. మూడో నెలలో గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఈ నిర్ణయం వలన ఆసుపత్రుల స్థాయిలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ట్రైనింగ్ వలన చిన్న మిస్టేక్స్ తగ్గి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం కావొచ్చు. ఇక స్టాండర్ట్ ఆపరేషన్ ప్రోసీజర్స్ నేర్చుకోవడం వలన సిబ్బంది సేవల్లో క్వాలిటీ పెరగనున్నది. అంతేగాక అత్యవసర పరిస్థితుల్లోనూ కాన్ఫిడెంట్ గా వైద్యం అందించేందుకు వీలు ఉంటుంది.
Also Read: తెలంగాణ బీజేపీలో బిగ్ షాక్.. ఆ సెక్రటరీపై వేటు? కొత్తగా 5 పదవులు!