YouTube New Design: ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తమ మొబైల్ యాప్‌లో కీలక మార్పులు చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కొత్త డిజైన్‌ను దశలవారీగా అందిస్తోంది. ఈసారి యాప్‌లో షార్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వీడియోలు క్రియేట్ చేసే వారికి కూడా కొత్త అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఈ మార్పుల్లో యూజర్లు ఎక్కువగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇంతకాలం యాప్ కింద కనిపించిన సబ్‌స్క్రిప్షన్స్ బటన్ ఇప్పుడు కనిపించదు.
దీంతో తమకు నచ్చిన ఛానళ్ల కొత్త వీడియోలు చూడాలంటే కొత్త మార్గాన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. మనకు నచ్చిన అంశాలకు సంబంధించిన వీడియోలను ఒకేచోట చూడటానికి కస్టమ్ ఫీడ్స్ ఫీచర్‌ను కూడా యూట్యూబ్ తీసుకొస్తోంది. మరి కొత్త డిజైన్‌లో ఏయే మార్పులు వచ్చాయి? సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్‌ను ఎక్కడికి మార్చారు? కొత్త ఫీచర్లు ఎలా పనిచేస్తాయో చూద్దామా..
ఇప్పటివరకు యూట్యూబ్ యాప్ కింద హోమ్, షార్ట్స్, క్రియేట్, సబ్‌స్క్రిప్షన్స్, ప్రొఫైల్ అనే ఐదు బటన్లు కనిపించేవి. కొత్త డిజైన్‌లో వీటిని నాలుగుకు తగ్గించారు. హోమ్, షార్ట్స్, క్రియేట్, ప్రొఫైల్ మాత్రమే కింద ఉంటాయి. సబ్‌స్క్రిప్షన్స్‌ను పూర్తిగా తీసేయలేదు. దాన్ని హోమ్ పేజీ పైభాగంలోని కొత్త మెనూలోకి మార్చారు. అందుకే పాత అలవాటుతో కింద వెతికితే ఆ ఆప్షన్ కనిపించదు.
Also Read: ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!
యాప్ తెరిచిన వెంటనే హోమ్ పేజీ పైభాగంలో హోమ్, సబ్స్, మ్యూజిక్, లైవ్, మోర్ అనే ట్యాబ్స్ కనిపిస్తాయి. మోర్‌లోకి వెళ్తే మూవీస్ అండ్ టీవీ, చార్ట్స్, గేమింగ్, మెంబర్‌షిప్స్ వంటి ఇతర విభాగాలు ఉంటాయి. అయితే కొత్త పై మెనూ కొద్ది సెకన్లకే కనిపించకుండా పోవచ్చు. అప్పుడు హోమ్ ఫీడ్‌పై వేలితో కిందికి లాగితే అది మళ్లీ కనిపిస్తుంది. తర్వాత సబ్స్‌పై నొక్కితే మీరు ఫాలో అవుతున్న ఛానళ్ల కొత్త వీడియోలను చూడొచ్చు.
కొత్త హోమ్ పేజీలో షార్ట్స్ వీడియోలకు ఎక్కువ స్థలం ఇచ్చారు. అవి ఎక్కువగా కనిపించడం కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి వారి కోసం మూడు చుక్కల మెనూలో ‘షో ఫ్యూవర్ షార్ట్స్’ అనే ఆప్షన్ ఉంది. దాన్ని ఎంచుకుంటే హోమ్‌లో షార్ట్స్‌ను తగ్గిస్తామని యూట్యూబ్ చెబుతుంది. నిర్ణయం మార్చుకుంటే వెంటనే అన్‌డూ నొక్కి వెనక్కి వెళ్లొచ్చు.
మరో ఆసక్తికరమైన మార్పు కస్టమ్ ఫీడ్స్. పై మెనూలోని ప్లస్ గుర్తు ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మనకు కావాల్సిన అంశాలు, ఛానళ్లు లేదా వీడియోల శైలిని సాధారణ మాటల్లో టైప్ చేస్తే, వాటికి తగ్గ ప్రత్యేక ఫీడ్‌ను యూట్యూబ్ రూపొందిస్తుంది. ఉచిత ఖాతాదారులు గరిష్ఠంగా మూడు ఫీడ్స్, ప్రీమియం సభ్యులు ఎనిమిది ఫీడ్స్ వరకు జోడించుకోవచ్చు. ఈ ఫీచర్ అన్ని దేశాల్లో ఒకేసారి అందుబాటులోకి రాకపోవచ్చు. కాబట్టి మీ యాప్‌లో కనిపించకపోతే కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.
Also Read: ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!