Reliance Jio: ప్రస్తుతం చాలామంది తమ వద్ద ఉన్న రెండో సిమ్ కార్డును కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ కోసం, బ్యాంక్ ఓటీపీల కోసం మాత్రమే వాడుతున్నారు. ఎలాంటి రీఛార్జ్ చేయకపోయినా నెలల తరబడి ఇన్‌కమింగ్ కాల్స్ వస్తుండటంతో జియో సిమ్‌ను సెకండరీ నంబర్‌గా మెయింటైన్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, ఇకపై ఆ పరిస్థితి మారబోతున్నట్లు కనిపిస్తోంది. రీఛార్జ్ ప్లాన్ ముగిసిన వెంటనే ఇన్‌కమింగ్ సేవలను నిలిపివేయడానికి జియో సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన జియో వినియోగదారులకు కంపెనీ నుంచి SMSలు వస్తున్నట్లు తెలిపారు. అందులో మీ రీఛార్జ్ ప్లాన్ ముగిసిందని, ఇన్‌కమింగ్ కాల్స్ ఎప్పుడైనా ఆగిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. మళ్లీ సేవలు పొందాలంటే వెంటనే రీఛార్జ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మెసేజ్‌లో జియో రీఛార్జ్ లింక్ కూడా ఉంది. అయితే కాల్స్ ఎప్పుడు నిలిపివేస్తారనే విషయంపై స్పష్టమైన తేదీని కంపెనీ చెప్పలేదు.
టిప్‌స్టర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం.. రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్‌తో పాటు ఎస్ఎంఎస్‌లు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే జియో పంపిన హెచ్చరిక మెసేజ్‌లో మాత్రం ఇన్‌కమింగ్ కాల్స్ గురించే ప్రస్తావించింది. ఎస్ఎంఎస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అంతేకాదు.. ఈ మార్పుపై జియో ఇప్పటివరకు అధికారిక ప్రకటన కూడా చేయలేదు. కాబట్టి.. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: జాగ్రత్త.. మీకు తెలియకుండానే ఈ యాప్స్ మిమ్మల్ని గమనిస్తున్నాయి, కెమెరా, మైక్ పర్మిషన్లను ఆపేయండిలా!
ఇప్పటివరకు ఎయిర్‌టెల్, వీఐ నెట్‌వర్క్‌లలో రీఛార్జ్ గడువు ముగిసిన కొద్దిరోజులకే ఇన్‌కమింగ్ సేవలు ఆగిపోయేవి. కానీ జియో మాత్రం చాలాకాలం పాటు ఈ సౌకర్యాన్ని కొనసాగించింది. దీంతో బ్యాంక్ ఓటీపీలు, ముఖ్యమైన కాల్స్ కోసం చాలామంది జియో సిమ్‌ను రెండో నంబర్‌గా ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ విధానం మారితే అలాంటి వారికి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు, యూపీఐకి లింక్ చేసిన నంబర్ల విషయంలో జాగ్రత్త అవసరం.
TRAI సూచనల తర్వాత జియో వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అవసరం లేకుండా కాల్స్, ఇతర సేవల కోసం ఈ ప్లాన్లను ఎంచుకోవచ్చు. కాబట్టి.. మీ జియో నంబర్ ముఖ్యమైన సేవలకు లింక్ అయి ఉంటే, రీఛార్జ్ గడువును గమనిస్తూ ఉండటం మంచిది. కంపెనీ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి ఉండటం ఉత్తమం.