ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా? అన్నట్టుగా కర్ణాటక రాష్ట్రం కరువు కోరలకు చిక్కిన రైతాంగాన్ని ఆదుకునేందుకు నడుం బిగించింది. కరువు రాగానే రాష్ట్రాల చూపు కేంద్రం వైపే ఉంటుంది. ఆదుకోవాలని, కేంద్ర నిధులు విడుదల చేయాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తారు. ప్రధానిని కలుస్తారు. ఓ అంచనా నివేదికను కూడా సమర్పిస్తారు.
కానీ కడుపు కాలేటోడికి ఉన్నంత బాధ కేంద్రానికి ఉండదు. అది స్పందించాల్సిన సమయంలోనే తీరిగ్గా స్పందిస్తుంది. నిబంధనలు వర్తిస్తాయి.. అనే సాకుతో కేంద్రం నిధుల విడుదలలో తీవ్ర తాత్సారం జరుగుతూనే ఉంటుంది. అదీ ఆ రాష్ట్రంలో తమ సర్కార్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే.. ఇక అంతే సంగతులు. మరింత ఆలస్యం. తప్పని ఎదురుచూపులు. అదే జరిగింది కర్ణాటకలో.
కరువు తీవ్రంగా ఉందని, నివేదికలు సమర్పించి, కేంద్రాన్ని కరువు ప్యాకేజీ కోరింది ఆ రాష్ట్రం. నివేదిక అందగానే నిబంధనల ప్రకారం కేంద్ర కరువు బృందం ఫీల్డ్ పర్యటన చేస్తుంది. వాస్తవ పరిస్థితులు తెలుసుకుని నిబంధనల మేరకు పంటనష్టం ఎంత జరిగింది? ఎన్ని ఎకరాలు..? అనే వివరాలతో కూడిన నివేదికను వారం, పది రోజుల్లో కేంద్రానికి పంపిస్తుంది. ఇది పంపిన వెంటనే ఇక నిధుల విడుదలకు పెద్దగా ఆలస్యం ఉండదు. ఈ తతంగమంగా అక్కడ పూర్తయ్యింది. కానీ, కేంద్రం నుంచి ఉలుకు లేదు పలుకు లేదు.
కానీ, చూసీ చూసీ విసిగిపోయిన కర్ణాటక సీఎం.. ఇక లాభం లేదనుకుని రైతులను ఆదుకునే తక్షణ కర్తవ్యాన్ని గుర్తెరిగి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ. 2500 చొప్పున చెల్లించేందుకు గాను, రూ. 1250 కోట్ల నిధులను విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ టకటకా జరిగిపోతున్నదక్కడ. ఈ ఎల్‌నినో కరువు బారిన పడిన రైతులను ఆదుకునే విషయంలో కర్ణాటకనే ముందుందని చెప్పాలి. కేంద్రం సాయం లేకుండా సొంత నిధులతోనే వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది.
కర్ణాటకలో గత 70 ఏళ్లలో చోటు చేసుకోని విధంగా అక్కడ కరువు విలయతాడవం చేస్తోంది. అంతలా అత్యల్ప వర్షపాతం నమోదయ్యిందక్కడ. రాష్ట్రంలోని మొత్తం 240 తాలూకాలలో 226 తాలూకాల్లో కరువు తీవ్రత ఉందని గుర్తించారు. 57.93 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించారు. ఈ కరువు ధాటికి పంటలు నష్టపోవడం వల్ల రూ. 62,452 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లిందని కూడా ప్రధానికి ..అ క్కడి సీఎం వివరించారు. వెంటనే రూ. 22,400 కోట్ల కరువు ప్యాకేజీ పంపాలని రెండు పర్యాయాలు కోరినా ఫలితం దక్కలేదు.
అందుకే తక్షణ సాయం కింద రైతులను ఆదుకునేందుకు తమ సొంత నిధులను విడుదల చేసి, రైతల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని వేగిరం చేసింది ఆ సర్కార్. ఇక తెలంగాణలో .. 31 జిల్లాల పరిధిలో మొత్తం 365 మండలాలు కరువు బారిన పడ్డాయి. ఈ కరువు ఎఫెక్ట్‌తో ముందు జాగ్రత్తగా 13.22 లక్షల ఎకరాల్లో సాగు బంద్ అయ్యింది. సాగైన వాటిల్లో 25 లక్షల ఎకరాల మేర పంటలు ఎండిపోయాయి. వేలాది కోట్ల మేర పంట నష్టం జరిగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రూ. 30,000 కోట్ల కేంద్ర కరువు ప్యాకేజీ కావాలని పీఎంను కోరారు.
అయితే ఇంకా కరువు బృందం పర్యటన ఇక్కడ జరగలేదు. పర్యటించిన అనంతరం, నివేదిక సమర్పించిన తరవాత.. హైలెవల్ కమిటీలో చర్చించి, తీర్మానించి.. నిధులు విడుదల చేస్తారు. దీని కోసం కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో తెలియదు. అయితే ఇప్పటి వరకు కరువు ప్యాకేజీ కింద రూ. 30 వేల కోట్లు ఇచ్చిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి లేదు. గతంలో కేసీఆర్ సర్కార్ అడిగిన మూడు వేల కోట్ల ప్యాకేజీలో ముప్పావు వంతు కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు తెలంగాణ విషయంలో మోడీ ఈ కరువు ప్యాకేజీ విషయంలో ఎలా స్పందిస్తారోననే అనుమానాలున్నాయి.