Jumped Deposit Scam : మోసాలు చేయటానికి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారులను ఎంచుకుంటున్నారు. ప్రతిచోటా దొరికిన విధంగా దోచేస్తున్నారు. ఇంకా ఇప్పటికే పెరిగిపోతున్న మోసాలతో పాటు కొత్తగా మరో స్కామ్ యూపీఐ ఖాతాదారుల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. జంప్డ్ డిపాజిట్ స్కామ్ పేరుతో జరుగుతున్న ఈ స్కామ్ ఏంటో తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్లు బాధితుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని కొత్త మోసానికి తెరతీస్తున్నారు. ఈ స్కామ్ లో భాగంగా UPI ఖాతాలలో చిన్న మొత్తాలను డిపాజిట్ చేస్తారు. ఆపై బాధితుడికి కాల్ చేసి పొరపాటున ఎకౌంట్ లోకి డబ్బులు వచ్చాయని చెప్తూనే తమ ఎకౌంటు సరిగ్గా పనిచేయటం లేదని.. ఒక లింకు ద్వారా తిరిగి డబ్బులు పంపించమని నమ్మేటట్టు చేస్తారు. ఆపై ఆ లింక్ పై క్లిక్ చేసిన బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి నేరాలు తమిళనాడులో ఎక్కువగా జరగటంతో ఇలాంటి వాటిని నమ్మొద్దని అక్కడ పోలీసులు హెచ్చరిస్తున్నారు
నిజానికి యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ లావాదేవీలు మరింత సులభతరం అయ్యాయి. డబ్బులు ఒక అకౌంట్ నుంచి మన ఎకౌంట్ కు బదిలీ అవుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకునే స్కామర్స్ రెచ్చిపోతున్నారు. మోసం చేయడానికి కొత్తదారులను వెతుక్కుంటున్నారు. జంప్డ్ డిపాజిట్ స్కామ్ లో సైతం మోసగాళ్లు ఈ విధంగానే ఎదుటివారి నమ్మకాన్ని గెలుచుకొని మోసం చేస్తున్నారు. తక్కువ మొత్తంలో డబ్బులు పంపించి ఎక్కువ మొత్తంలో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కొంత మొత్తాన్ని ఒకరి ఎకౌంట్ కు బదిలీ చేసిన తర్వాత వారికి ఫోన్ చేసి ఒక అబద్ధపు కథనాన్ని చెబుతారు. డబ్బులు కోల్పోయామని పరిస్థితి వివరిస్తూ అబద్ధాలకి తెర తీస్తారు. తన అకౌంట్ పనిచేయడం లేదంటూ చెల్లింపుకు ఒక లింకును పంపిస్తామంటూ.. ఆ లింక్ పై క్లిక్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయమని చెబుతారు. ఇలా ఎంటర్ చేసిన వెంటనే ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం కోల్పోవడం లేదా ఫోన్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఇలాంటి విషయాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే ప్రమాదాలు జరుగుతాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో ఎక్కడికక్కడ జరుగుతున్న ఇలాంటి స్కామ్స్ కు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి కాల్స్ ను లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. తెలియని నెంబర్స్ నుంచి వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్ ను లిఫ్ట్ చేయొద్దని సైబర్ పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఖాతాలో బ్యాలెన్స్ ను ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాలని.. ఎవరైనా డబ్బులు పంపించామని చెప్పినా ముందుగా పూర్తిగా విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలుపుతున్నారు. ఒకవేళ తిరిగి పంపాల్సి వస్తే ఫోన్ పేలో పంపాలి తప్పా ఎలాంటి లింక్స్ ను క్లిక్ చేయొద్దని చెబుతున్నారు. ముఖ్యంగా యూపీఐ డీటెయిల్స్ తో పాటు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి వివరాలు వేరొకరితో షేర్ చేసుకోవద్దని తెలుపుతున్నారు.
ALSO READ : LG హోమ్ ప్రొజెక్టర్స్ లాంఛ్ — అతి చిన్న 4K UST మోడల్‌తో!