Karbonn Mobiles: ఒకప్పుడు భారతీయ మొబైల్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్బన్ మొబైల్స్ మళ్లీ మన ముందుకు రాబోతోంది. తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ఫోన్లను అందిస్తూ వినియోగదారులకు చేరువైన ఈ దేశీయ బ్రాండ్.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తిరిగి తన స్థానాన్ని సంపాదించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ చైనా బ్రాండ్ల ఆధిపత్యంలో ఉన్న మార్కెట్‌లో కార్బన్ రీఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఎలాంటి ఫోన్లను తీసుకురానుంది? వాటి ధరలు, ఫీచర్లు ఎలా ఉండనున్నాయి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మన మార్కెట్లో చైనా కంపెనీలదే హవా నడుస్తోంది. వివో, ఒప్పో, షావోమి లాంటి బ్రాండ్లు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అయితే, మొబైల్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులకు, స్టూడెంట్స్‌కు మంచి ఫోన్లు కొనడం భారంగా మారింది. ఈ గ్యాప్‌ను గమనించిన కార్బన్.. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చేందుకు రీఎంట్రీ ఇస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా రీల్స్ చేసే కంటెంట్ క్రియేటర్లకు, కాలేజ్ స్టూడెంట్స్‌కు ఈ ఫోన్లు కచ్చితంగా నచ్చుతాయని కంపెనీ నమ్ముతోంది.
Also Read: గ్రూప్ చాటింగ్ ఇకపై సూపర్ ఈజీ.. వాట్సప్ తెచ్చిన ఆ 4 కొత్త ఫీచర్ల గురించి తెలుసా?
2009లో జైనా గ్రూప్, యూటీఎల్ సంయుక్తంగా ఈ బ్రాండ్‌ను ప్రారంభించాయి. ఆ కాలంలో తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్లు ఇస్తూ అతి తక్కువ సమయంలోనే నాల్గవ స్థానానికి ఎదిగింది. ఐపీఎల్ సమయంలో ప్రమోషన్లతో హోరెత్తించింది. అయితే చైనా కంపెనీలు తక్కువ ధరలకే వందల మోడల్స్ తేవడంతో కార్బన్ కాస్త వెనుకబడిపోయింది. స్మార్ట్‌ఫోన్ల రేసు నుంచి తప్పుకున్నా.. గ్రామీణ ప్రాంతాల కోసం కీప్యాడ్ ఫోన్లను విక్రయిస్తూనే ఉంది.
ఇప్పుడున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశీయ కంపెనీలకు గట్టి మద్దతు ఇస్తోంది. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. అక్టోబర్ 2028 నాటికి మన దేశంలోనే డిజైన్ చేసి, తయారు చేసిన ఫోన్లు పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తాయని సర్కార్ భావిస్తోంది. ఈ తరుణంలో కార్బన్ రీఎంట్రీ సరిగ్గా సెట్టయింది.
ఇప్పటివరకు కంపెనీ అధికారికంగా అన్ని వివరాలు ప్రకటించకపోయినా.. కొన్ని లీక్స్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గీక్‌బెంజ్‌లో ‘కార్బన్ జెంజ్ ప్రో’ అనే ఫోన్ కనిపించగా.. అమెజాన్‌లో ‘కార్బన్ రెబెల్ 5జీ’ పేరుతో టీజర్లు వస్తున్నాయి. మీడియాటెక్ ప్రాసెసర్‌తో పాటు లేటెస్ట్ ఫీచర్లతో ఇవి రానున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానుండటంతో.. మన దేశీయ బ్రాండ్ మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Also Read: మనసు మార్చుకున్న యాపిల్.. టచ్‌స్క్రీన్‌తో MacBook Pro లాంచ్, ధర ఎంతంటే?