Duplicate SIM: మొబైల్ ఫోన్ పోయినప్పుడు అందులోని ఫొటోలు, డేటా గురించి మాత్రమే కాదు.. మన ఫోన్ నంబర్ ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం గురించీ ఆలోచించాలి. బ్యాంక్ ఖాతాలు, యూపీఐ యాప్‌లు, ఓటీపీలు అన్నీ అదే నంబర్‌కు లింక్ అయి ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా.. మీ టెలికాం కంపెనీని సంప్రదించి, పాత నంబర్‌తోనే మరో సిమ్ కార్డ్ సులభంగా పొందవచ్చు. దీనికోసం ముందుగా పాత సిమ్‌ను బ్లాక్ చేయించి, తర్వాత గుర్తింపు వివరాలతో వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
ఫోన్ కనిపించకపోతే ఆలస్యం చేయకుండా మీ నెట్‌వర్క్ కస్టమర్ కేర్‌కు మరో ఫోన్ నుంచి కాల్ చేసి సిమ్‌ను బ్లాక్ చేయించండి. జియో యూజర్లు 1800-889-9999కు కాల్ చేయవచ్చు. Airtel, Vi, BSNL కస్టమర్లు తమ నెట్‌వర్క్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. ఫోన్ కూడా దొంగిలించబడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. తర్వాత సంచార్ సాథీ వెబ్‌సైట్‌లో ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయమని కోరవచ్చు. దీనివల్ల వేరే సిమ్ వేసినా ఆ ఫోన్ మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ కాదు.
Jio యూజర్లు జియో స్టోర్‌కు వెళ్లి పాత నంబర్‌కు డూప్లికేట్ సిమ్ కావాలని అడగాలి. నంబర్ చెప్పి గుర్తింపు వెరిఫికేషన్ పూర్తి చేస్తే కొత్త సిమ్ ఇస్తారు. Airtel కస్టమర్లు ముందుగా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి పాత సిమ్ బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత ఎయిర్‌టెల్ స్టోర్‌కు వెళ్లి ఆధార్ వంటి గుర్తింపు కార్డు, అవసరమైతే పోలీస్ ఫిర్యాదు కాపీ చూపించి కొత్త సిమ్ తీసుకోవచ్చు.
Also Read: రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!
Vi యూజర్లు కంపెనీ సిమ్ బ్లాకింగ్ సదుపాయంలో నంబర్ ఇచ్చి, ప్రత్యామ్నాయ ఫోన్ లేదా ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీతో అభ్యర్థనను నిర్ధారించవచ్చు. తర్వాత Vi స్టోర్‌కు వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. పాత సిమ్ బ్లాక్ చేసిన 90 రోజుల్లోపు కొత్త సిమ్ తీసుకోవాలని వి సూచిస్తోంది. BSNL యూజర్లు 1503కు (బీఎస్ఎన్ఎల్ నుంచి), ఇతర నెట్‌వర్క్ నుంచి 1800-180-1503కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలి. తర్వాత సంబంధిత కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి.
స్టోర్‌కు వెళ్లేటప్పుడు ఆధార్, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డు తీసుకెళ్లండి. ఫోన్ దొంగిలించబడితే పోలీస్ ఫిర్యాదు కాపీ కూడా అడగవచ్చు. ఏ పత్రాలు కావాలో ముందే కస్టమర్ కేర్‌ను అడగడం మంచిది. కొత్త సిమ్ పనిచేయడం మొదలైన తర్వాత కూడా ఎస్ఎంఎస్ సేవలు మొదటి 24 గంటలు అందుబాటులో ఉండవు. ఇది టెలికాం శాఖ నిబంధన. కాబట్టి.. ఆ సమయంలో బ్యాంక్ లేదా ఇతర యాప్‌ల ఓటీపీలు ఎస్ఎంఎస్ ద్వారా రావు. ఆ గడువు పూర్తయ్యాక మీ పాత నంబర్‌తోనే సేవలు కొనసాగించవచ్చు.