Online Cab Booking Scam : సైబర్ నారగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. మోసం చేసేందుకు ఏ మాత్రం అవకాశం దొరికినా వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా ఆన్లైన్ ను వేదికగా జరుగుతున్న ఈ మోసాలతో ప్రతి నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఊడిపీలో తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఈ విషయం మరోసారి నిరూపితమైంది.
ఉడిపిలో రూ. 4.1 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. సైబర్ నేరగాళ్లు మోసం చేసి రూ. 4.1 లక్షలు కొట్టేశారు. వెంటనే అసలు విషయాన్ని గుర్తించిన సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళితే… పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి ఉడిపిలో క్యాబ్ బుక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం గూగుల్లో కార్ రెంటల్స్ కోసం వెతుకుతూ శక్తి కార్ రెంటల్స్ అనే వెబ్‌సైట్లోకి వెళ్లాడు. కొద్దిసేపు తర్వాత అతని దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి కార్ రెంటల్స్ బుక్ చేశారు కదా బుకింగ్ టోకెన్ కోసం రూ. 150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని… అందుకోసం శక్తి కార్ రెంటల్స్ అనే వెబ్సైట్ లింక్ క్లిక్ చేయాలని తెలిపాడు. ఇందతా నిజమే అనుకున్న సదరు వ్యక్తి కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే దాంతో ఓటీపీ రాకపోవడంతో తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ఉపయోగించి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఓటీపీ రాలేదు. ఇంతకుమించి అదనపు చెల్లింపులు ఏమీ జరగనప్పటికీ కాసేపటికి కారు రావడంతో ఆ వ్యక్తి కారు ఎక్కి కూర్చున్నాడు. అనంతరం ఆ వ్యక్తి బ్యాంక్ కార్డు నుండి డబ్బులు క్రమంగా వేరు వేరు అకౌంట్స్ కు జమ అయ్యాయి. SBI క్రెడిట్ కార్డ్ నుండి రూ. 3.3 లక్షలు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డ్ నుండి రూ. 80,056 గా మొత్తం రూ. 4.1 లక్షలు డెబిట్ అయినట్లు బ్యాంక్ సందేశాలు వచ్చాయి. దీంతో మోసపోయానని గుర్తించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన ఉడిపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆన్‌లైన్ లో రూ. 6.3 లక్షలు పోగొట్టుకున్న మహిళ
ఆన్ లైన్ లో జాబ్ ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ. 6.3 లక్షలు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల అంజలికు సెప్టెంబర్ 14న ఉద్యోగం ఇప్పిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. పరీక్షతో పాటు ఇంటర్వ్యూకి సైతం హాజరు కావాలని.. అడ్మిషన్ ఫీజుగా రూ. 2000 బదిలీ చేయాలని చెప్పడంతో ఆమె నమ్మి గూగుల్ పే ద్వారా డబ్బులు పంపింది. అనంతరం పలు కారణాలు చెబుతూ సెప్టెంబరు 14 నుంచి నవంబర్ 4 మధ్య ఆమె బ్యాంక్ ఖాతా నుండి వివిధ UPI లావాదేవీల ద్వారా రూ. 4.3 లక్షలు, NEFT ద్వారా రూ. 1.9 లక్షలు బదిలీ చేయమని ఆమెను ఒప్పించి డబ్బులు తీసుకున్నారు. అనంతరం కాల్ చేసినా వాళ్ళు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆర్థికంగా తను ఎంతగానో నష్టపోయానని.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసం చేశారని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని తెలిపింది. ఇక ఇలాంటి సంఘటనలు ఎక్కడికక్కడ జరుగుతున్నప్పటికీ ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తం కావటంలేదని.. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.
ALSO READ : యాపిల్ తో తప్పదు ముప్పు.. ఐఫోన్ 16తో పాటు iPad, MacBook, Watchesకు పొంచి ఉన్న ప్రమాదం