Seethakka on BRS : తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణాను అప్పుల పాలుచేసిన బీఆర్ఎస్ పార్టీ.. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేసేందుకు ప్రయత్నిస్తోందని పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమాన్ని కక్షపూరితంగా విస్మరిస్తున్నారన్న సీతక్క.. మహారాష్ట్రలో బీజేపీ కు.. బీఆర్ఎస్ బీ-టీమ్ గా పనిచేస్తుందని అన్నారు.
రాష్ట్రాన్ని రెండుసార్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఎన్నో తప్పుడు పాల్పడిందని, వాటికి సంబంధించిన కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీ తో అంటకాగుతోందని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని, పదేపదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల ఉచిత ప్రయాణ పథకంపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ.. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అత్యవసర సమయాల్లో చేతిలో రూపాయి లేకున్నా మహిళలు ఉచిత ప్రయాణాలు చేయగలుగుతున్నారని వివరించారు. ప్రజా సంక్షేమాన్ని జీర్ణించుకోలేక ఆటో డ్రైవర్లను ఉసిగొల్పుతున్నారన్న మంత్రి సీతక్క.. ఓలా, ఉబర్ క్యాబ్లు, బైక్లు తెచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
రుణమాఫీ చేస్తామని ప్రకటించి, ప్రజల్ని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు రైతులపై లేని ప్రేమ కురిపిస్తుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ హయాంలో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని, వారు విడుదల చేసిన డబ్బులు.. రైతులకు బ్యాంకు వడ్డీలు చెల్లించేందుకు సైతం సరిపోలేదని అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం కేవలం 27 రోజుల్లోనే 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది అన్నారు. బీఆర్ఎస్ ఏక కాలంలో కనీసం రూ. లక్ష రుణమాఫీ చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగానే.. ఎంతో మంది రైతులు బ్లాక్ లిస్టులోకి వెళ్లారని, దాంతో ఇప్పుడు తమకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
రూ. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న మంత్రి సీతక్క.. సామాన్యుల గృహాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన బీఆర్ఎస్ చేయలేదని విమర్శించారు. మహిళలకు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, బీఆర్ఎస్ ఎగ్గోట్టిన వడ్డీలను కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తోందని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి రూ. 400 ఉన్న గ్యాస్ ధరను రూ.1,200 చేశాయన్న మంత్రి సీతక్క.. వంటింటి భరాన్ని తగ్గించేందుకు రూ. 500 కే సిలిండర్ ఇస్తున్నట్లు తెలిపారు.
పదేళ్లలో కనీసం లక్ష ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇవ్వకపోయింది, కానీ ఆరు మాసాల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. తమకు ప్రజలు ఐదేళ్ల కాలం ఇచ్చారని. ఇంకా నాలుగేళ్లల్లో ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తామని ప్రకటించారు.
Also Read : . ఇక నీ దుకాణం బంద్.. ప్రజలెప్పుడో మరచిపోయారు.. సీఎం రేవంత్ రెడ్డి
గూడు లేని వాళ్లకు కాంగ్రెస్ గత ప్రభుత్వాలు లక్షల ఇళ్లు ఇచ్చాయి, ఇప్పుడు కూడా రూ.5 లక్షలతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తోందని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు అణచివేత.. విపక్షంలో ఉన్నప్పుడు అవస్తవాలు చెప్పడమే బీఆర్ఎస్ నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు.