Apple AI Engineer Meta| టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిపుణుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మెటా సంస్థ ఒక షాకింగ్ ఆఫర్ తో ఆపిల్ కంపెనీ టాప్ ఏఐ ఇంజినీర్ ని లాగేసుకుంది. ఆపిల్ సంస్థలో AI మోడల్స్ టీమ్‌కు నాయకత్వం వహించిన రుయోమింగ్ పాంగ్ అనే ఇంజనీర్‌ను మెటా తన వైపు తీసుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. పాంగ్‌కు మెటా ఇచ్చిన ఆఫర్ దాదాపు ₹1712 కోట్ల (200 మిలియన్ డాలర్లు) విలువైనది , ఇది AI నిపుణుల కోసం జరుగుతున్న పోటీలో ఇప్పటివరకు ఇచ్చిన అతి పెద్ద సాలరీ ఆఫర్ గా నిలిచింది. ఈ ఆఫర్‌లో జీతం, సైనింగ్ బోనస్, మెటా స్టాక్‌లు ఉన్నాయి. పాంగ్ లభించే ఈ వేతనం.. క్రమంగా కొన్ని సంవత్సరాలలో అందుతుంది.
ఆపిల్‌కు సాధ్యం కాని ఆఫర్
మెటా ఇచ్చిన ఈ భారీ ఆఫర్‌లో ఎక్కువ భాగం స్టాక్‌ల రూపంలో ఉంది. అమెరికా సిలికాన్ వ్యాలీలో నైపుణ్యం కలిగిన ఉత్తమ టాలెంట్‌ను నిలుపుకోవడానికి కంపెనీలు సాధారణంగా ఈ విధానాన్ని ఉపయోగిస్తాయి. మెటా ఇచ్చిన ఆఫర్‌కు సమానమైన ఆఫర్ ఆపిల్ ఇవ్వలేకపోయింది లేదా ఇవ్వడానికి ఇష్టపడలేదని సమాచారం. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వార్షిక వేతనం కంటే రుయోమింగ్ పాంగ్ కు మెటా ఇచ్చిన ఆఫర్ ఎక్కువగా ఉంది. ఇది మెటా తన మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (MSL) విభాగాన్ని బలోపేతం చేయడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చూపిస్తుంది.
AI రంగంలో తీవ్ర పోటీ
టెక్ కంపెనీల మధ్య AI నిపుణులను ఆకర్షించడానికి తీవ్రమైన పోటీ నడుస్తోంది. మెటా ఈ ఆఫర్‌తో పాంగ్‌ను తీసుకోవడం ఈ పోటీ తీవ్రతను విపరీతంగా పెంచేసింది. ఇటీవల మెటా సీఈఓ ఆండ్రూ బోస్‌వర్త్.. ఇలాంటి భారీ ఆఫర్‌లతో టాలెంట్‌ను తాము ఆకర్షించడం లేదని చెప్పినప్పటికీ, మరోవైపు పాంగ్‌కు భారీ ఆఫర్ ఇవ్వడంతో మెటా కంపెనీ వ్యూహాలు బయటపడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్.. మెటా కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఇంజనీర్లను ఆకర్షించడానికి ఇతర కంపెనీలు (మెటా కంపెనీపై పరోక్షంగా) ₹850 కోట్ల ఆఫర్‌లు ఇస్తున్నాయని చెప్పారు. అయితే ఆల్ట్ మన్ ఆరోపణలు నిజం కాదని మెటా సీఈఓ తిప్పికొట్టారు. కానీ పాంగ్ ఆఫర్ బహిర్గతం కావడంతో నిజంగానే ఈ రంగంలో టఫ్ ఫైట్ నడుస్తోందని అర్థమవుతోంది.
ఆపిల్‌లో మార్పులు
పాంగ్ ఆపిల్‌ను వీడిన తర్వాత.. ఆపిల్ కంపెనీ తన ఫౌండేషన్ మోడల్స్ టీమ్‌కు జిఫెంగ్ చెన్‌ను నాయకుడిగా నియమించింది. అలాగే, ఇతర సీనియర్ ఇంజనీర్ల మధ్య బాధ్యతలు షేర్ చేస్తూ ఏఐ టీమ్‌ను పునర్వ్యవస్థీకరించింది. అయినప్పటికీ.. ఆపిల్ తన AI విభాగం కార్యకలాపాల గురించి, దాని వ్యూహాల గురించి బహిరంగ ప్రకటనలు ఎక్కువగా చేయడం లేదు. అయితే ఇతర కంపెనీలు.. ఏఐ ఇంజినీర్లకు పెద్ద ఆఫర్‌లు ఇస్తూ.. ప్రకటనలతో వార్తల్లో నిలుస్తున్నాయి.
Also Read: మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు .. ఎప్పటినుంచి అంటే?
ఏఐ భవిష్యత్తు ఊహాగానాలు
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. పాంగ్ ఒక్కడే కాదు, ఆపిల్ AI విభాగం నుండి ఇతర ఇంజనీర్లు కూడా ఇలాంటి ఆఫర్‌లను పరిశీలిస్తున్నారు లేదా కంపెనీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది AI రంగంలో పోటీ ఎంత తీవ్రంగా ఉందో, మెటా వంటి కంపెనీలు ఈ రంగంలో అగ్రస్థానంలో నిలవడానికి ఎంత భారీగా ఖర్చు చేస్తున్నాయో తెలుపుతోంది. ఈ ఘటన AI రంగంలో టాలెంట్ కోసం జరుగుతున్న యుద్ధాన్ని తలపిస్తోంది.