Budget Smartphones India: ఒకప్పుడు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన మైక్రోమ్యాక్స్, కార్బన్ బ్రాండ్లు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. చైనా మొబైల్ కంపెనీలు తక్కువ ధర ఫోన్ల తయారీని తగ్గించుకోవడంతో.. రూ.20,000 లోపు విభాగంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఈ దేశీయ కంపెనీలు కొత్త ప్రణాళికలతో మన ముందుకొస్తున్నాయి.
జైనా గ్రూప్ ఇప్పటికే కార్బన్ పేరుతో రెండు 4జీ ఫోన్లను తీసుకొచ్చింది. త్వరలో 5జీ ఫోన్లను కూడా విడుదల చేయాలని చూస్తోంది. మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ అగర్వాల్ కూడా బ్రాండ్‌ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అవకాశాలను పరిశీలిస్తూనే.. మైక్రోమ్యాక్స్‌ను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ మొబైల్ ఫోన్ తయారీ పథకం కూడా తోడ్పాటు ఇవ్వనుంది. అర్హత ఉన్న కంపెనీలకు అమ్మకాలపై 5 శాతం ప్రోత్సాహకం, డిజైన్, పరిశోధనలో పెట్టుబడులకు అదనంగా 3 శాతం ప్రోత్సాహకం అందించే అవకాశం ఉంది.
షావోమీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చి భారత మార్కెట్‌లో ఎదిగాయి. ఇప్పుడు మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, లాభాలు తగ్గడం వల్ల రూ.20 వేల లోపు ఫోన్లపై వాటి ఆసక్తి తగ్గుతోంది. రూ.9,300 నుంచి రూ.18,600 మధ్య ధర ఉన్న ఫోన్లే మార్కెట్‌లో పెద్ద భాగంగా ఉన్నాయి. ఈ విభాగం అమ్మకాలలో 40.6 శాతం వాటా కలిగి ఉన్నా, గత ఏడాదితో పోలిస్తే షిప్‌మెంట్లు తగ్గాయి.
Also Read: చలికాలంలో బట్టలు ఉతకడం కష్టంగా ఉందా? తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ 7KG వాషింగ్ మెషీన్లు ఇవే!
దేశీ కంపెనీలు ఇతర తయారీ సంస్థల సహాయంతో ఫోన్లు రూపొందించి మార్కెట్‌లోకి రావచ్చు. కానీ మెమరీ చిప్‌ల కొరత, అధిక ధరలు వాటికి సమస్యగా మారొచ్చు. పెద్ద మొత్తంలో భాగాలు కొనలేకపోతే తక్కువ ధరలో ఫోన్లు అందించడం కష్టం. అంతేకాదు.. మంచి నాణ్యత, సాఫ్ట్‌వేర్ అనుభవం, అమ్మకాల తర్వాత సేవలతో వినియోగదారుల నమ్మకాన్ని మళ్లీ సంపాదించాలి. డీలర్లు, రిటైల్ దుకాణాలతో సంబంధాలు కూడా బలపరచుకోవాలి.
పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. ఈ అవకాశం మరో ఏడాది లేదా రెండేళ్లు మాత్రమే ఉండొచ్చు. ఏఐ ప్లస్, మివి, బోల్ట్ వంటి చిన్న బ్రాండ్లు చవక 4జీ, 5జీ ఫోన్లతో ఎదుగుతున్నా.. వాటి అమ్మకాలు పరిమితంగానే ఉన్నాయి. మరోవైపు శాంసంగ్, చైనా కంపెనీల పోటీ కొనసాగుతుంది. ఫోన్ మార్కెట్ కూడా ఒత్తిడిలో ఉంది. మెమరీ ధరల పెరుగుదలతో ఫోన్ల సగటు ధర పెరిగి, అమ్మకాలు తగ్గుతున్నాయి. కాబట్టి.. మైక్రోమ్యాక్స్, కార్బన్‌కు తిరిగి రావడం మొదటి అడుగు మాత్రమే. సరైన ధర, నాణ్యత, సరఫరా, సేవలు కలిస్తేనే పాత పేరు మళ్లీ మార్కెట్‌లో నిలుస్తుంది.
Also Read: వారంటీ ఉన్నా రూ.79,000 రిపేర్ బిల్లు వేసిన యాపిల్.. చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?