Clashing Through the Snow on OTT: రొమాంటిక్ కామెడీ సినిమా లవర్స్ బాగా ఎంజాయ్ చేసే ఒక లవ్ స్టోరీ ఇప్పడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ఒకరినొకరు అస్సలు ఇష్టపడని ఇద్దరు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే పుట్టే నవ్వులు, రొమాన్స్ చూసేందుకు చాలా సరదాగా ఉంటాయి. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘క్లాషింగ్ త్రూ ది స్నో’ (Clashing Through the Snow) ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ’ ఫేమ్ క్రిస్టోఫర్ బ్రైనీ, ‘ల్యాండ్మ్యాన్’ ఫేమ్ మిచెల్ రాండోల్ఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్ల్సన్ యంగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతూ మన ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. మంచు తుఫానులో చిక్కుకున్న ఆ ఇద్దరి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందో, ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లాటిట్యూడ్ పబ్లిషింగ్’ సంస్థలో పనిచేసే ర్యాన్ మిచెల్, హన్నా హెండ్రిక్స్ మొదటి నుంచీ ఉప్పూనిప్పులా ఉండే ప్రత్యర్థులు. ఆఫీసులో జరిగే బడ్జెట్ కోతల వల్ల ఇద్దరిలో ఒకరి ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వస్తుంది. తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఒక భారీ బుక్ డీల్ కుదుర్చుకోవాలని ఇద్దరూ వేర్వేరుగా ప్లాన్ వేసుకుని, క్రిస్మస్ సెలవుల్లో రహస్యంగా న్యూయార్క్ బయలుదేరతారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ ఒకే విమానంలో పక్కపక్కనే ఎదురుపడతారు. అయితే భారీ మంచు తుఫాను కారణంగా విమానాన్ని మధ్యలోనే సాల్ట్ లేక్ సిటీలో అత్యవసరంగా దించేయడంతో అసలు కష్టాలు మొదలవుతాయి.
ఎలాగైనా న్యూయార్క్ చేరుకోవాలనే పట్టుదలతో విమానాశ్రయంలో మిగిలిన ఒకే ఒక్క అద్దె కారును ఇద్దరూ కలిసి పంచుకోవాల్సి వస్తుంది. ఒకరినొకరు చూస్తేనే చిరాకుపడే వీరిద్దరి ప్రయాణం ఆద్యంతం ఎన్నో మలుపులు తిరుగుతుంది. మంచు రోడ్లపై కారు ప్రమాదానికి గురవడం, ఆ తర్వాత టెడ్డీ అనే వింత వ్యక్తి నడిపే ‘మెర్సీవిల్లే ఇన్’ అనే పాత హోటల్లో చిక్కుకుపోవడం వంటి తమాషా సంఘటనలు వీరిని దగ్గర చేస్తాయి. ఆ గందరగోళ ప్రయాణంలో ఒకరి కష్టసుఖాలను మరొకరు అర్థం చేసుకోవడంతో, మొదట్లో ఉన్న ద్వేషం కాస్తా మెల్లగా ప్రేమగా మారుతుంది.
చివరికి ఎన్నో ఆటంకాలను దాటుకుని న్యూయార్క్ చేరుకున్నప్పటికీ, వారు ఆశించిన పెద్ద రచయితల డీల్స్ చేజారిపోతాయి. కానీ, ఆ ప్రయాణంలో తమకు పరిచయమైన హోటల్ మేనేజర్ టెడ్డీ రాసిన ‘మెర్సీవిల్లే మసాకర్’ అనే పుస్తకాన్ని ప్రచురించాలనే ఆలోచన వీరిద్దరికీ కలిసి వస్తుంది. ఆ పుస్తకం ఊహించని విధంగా సూపర్ హిట్ అవ్వడంతో ఇద్దరి ఉద్యోగాలు నిలబడతాయి. కేవలం ఉద్యోగాలే కాకుండా, క్రిస్మస్ చెట్టు కింద ర్యాన్ తన మనసులోని ప్రేమను హన్నాకు చెప్పడంతో ఇద్దరూ ఒక్కటవుతూ కథ సుఖాంతమవుతుంది.
రొమాంటిక్ కామెడీ మూవీ ‘క్లాషింగ్ త్రూ ది స్నో’ (Clashing Through the Snow) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 5.6/10 రేటింగ్ సాధించిన ఈ మూవీ 2026 నవంబర్ 23న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌గా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. విశేషమేమిటంటే ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటంతో, వీకెండ్లో లైట్-హార్టెడ్ లవ్ స్టోరీ చూడాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్.