
Aditya-L1 Mission latest update(Morning news today telugu) :
సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య -L1 మిషన్… ఓ అద్భుతాన్ని క్లిక్ మనిపించింది. లక్ష్యంగా దిశగా దూసుకెళుతున్న ఆదిత్య.. వండర్‌ఫుల్ సెల్ఫీ తీసుకుంది. ఆదిత్య తీసిన సెల్ఫీలో భూమి, చంద్రుడు ఓకే ఫ్రేమ్‌లో కనిపించాయి. ఈ చిత్రాలను… ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇప్పుడీ పిక్స్ వైరల్‌గా మారాయి.
భూమి, సూర్యుడి మధ్య దూరం 15 కోట్ల 10 లక్షల కిలోమీటర్లు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లదూరంలోని లగ్రాంజ్ పాయింట్‌కు ఆదిత్య L1 చేరుకోనుంది. లగ్రాంజ్ పాయింట్‌లో అవరోధాలేవీ లేవని ఇటలీ శాస్త్రవేత్త జోసెఫ్ లూయీ లగ్రాంజ్ కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిపై ప్రయోగాలు చేపట్టిన దేశాలకు భిన్నంగా ఇస్రో లాంగ్రేజ్ పాయింట్లో శాటిలైట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ పాయింట్‌లో భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు దాదాపు సమానంగా ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. కాబట్టి ఆదిత్య-L 1 అంతరిక్ష నౌక బ్యాలెన్సింగ్‌గా అక్కడ నిలవగలుగుతుంది.
భూమి,సూర్యుడి మధ్య మొత్తం 5 లగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి. సూర్యుడి ఉపరితలం ఫొటోస్పియర్‌లో 6 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే.. సూర్యుడి కరోనాలో ఏకంగా 10 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడిని మించి కరోనాలో భారీగా ఉష్ణోగ్రతలుంటాయి. అందుకు గల కారణాలనే ఆదిత్య- L1 వన్ మిషన్ అన్వేషిస్తుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువకాలం కక్ష్యలో కొనసాగటం ఈ మిషన్ ప్రత్యేకత. ఆదిథ్య- L1 మిషన్ లాంగ్రేజియన్ పాయింట్ చేరుకునేందుకు దాదాపు 125 రోజుల సమయం పడుతుంది.
4 నెలల తర్వాత లగ్రాంజ్ పాయింట్‌కు ఆదిత్య- L1 చేరనుంది. సౌర తుపాన్లు, ప్లాస్మా, జ్వాలలు, విస్ఫోటాలను ఆదిత్య -L1 విశ్లేషిస్తుంది. సూర్యుడిలోని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ ప్రాంతాలను… అతి నీలలోహిత తరంగ దైర్ఘ్యంలో సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ చిత్రీకరించనుంది. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సౌర రేడియోధార్మికతను కొలుస్తుంది. L1 పాయింట్ వద్ద గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను మ్యాగ్నెటోమీటర్ పరిశీలిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్‌రే జ్వాలలను సోలార్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ అధ్యయనం చేస్తాయి. సౌర గాలులు, ఆవేశిత అయాన్లు, వాటి శక్తి విస్తరణ తీరును సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య పరికరాలు శోధిస్తాయి.
మిషన్ ఆదిత్య ప్రయోగం కోసం భారత్ 400 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ప్రయోగం చేపట్టారు. సరిగ్గా ఇలాంటి ప్రయోగం కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారీగా 12,300 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. నాసా ఖర్చు కంటే ఇస్రో ఖర్చు.. ఏకంగా 97 శాతం తక్కువ. ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన PSLV రాకెట్‌లో అత్యంత శక్తిమంతమైన వేరియంట్ XLను ఇస్రో ఉపయోగించింది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1 మిషన్‌లోనూ, 2013లో నిర్వహించిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో PSLV-XL వేరియంట్లను ఉపయోగించారు.