మయన్మార్ భూకంపంతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు నేలమట్టం అయ్యాయి. వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్ లో కూడా ప్రజలు భయం గుప్పిట విలవిల్లాడిపోతున్నారు. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ ని క్షేమంగా భూమిపైకి తీసుకు రాగలిగాం కానీ, భూమిపై జరుగుతున్న ప్రకృతి విపత్తుల్ని మాత్రం అరికట్ట లేకపోతున్నాం. అరికట్టడం సంగతి అటుంచితే, కనీసం గుర్తించలేకపోవడం శోచనీయం. భూకంపం వస్తుందని కొన్ని నిమిషాలముందు తెలిసినా ప్రమాదం ఉండే ప్రాంతాలనుంచి బాధితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అధునాతన వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదు. ఉన్నా కూడా కొన్ని క్షణాల ముందే అది తెలుస్తుంది. ఆ హెచ్చరికలు జనాల వద్దకు చేరే టప్పటికి అసలు ప్రమాదం ముంచుకొస్తుంది.
మొబైల్ యాప్ తో..
భూకంపం వస్తుందని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికలు చేసి, వాటిి జనం విని జాగ్రత్తలు పాటించాలంటే పుణ్యకాలం పూర్తవుతుంది. అయితే ఆ హెచ్చరికల వ్యవస్థ మన ఫోన్ లోనే ఉంటే, అలారం మోగినట్టు.. భూకంపం వచ్చేముందు మన ఫోన్ మోగితే.. అప్పుడు ఏమవుతుంది. అలర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. భూకంపం హెచ్చరికలు జారీ చేసేందుకు చాలా రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అందులో మై షేక్ అనేది ఒక లేటెస్ట్ యాప్. అమెరికాలోని బర్కిలీలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీ సెస్మొలాజికల్ డిపార్ట్ మెంట్ వారు ఈ యాప్ ని అభివృద్ధిచేశారు. ఫోన్ లో ఉన్న యాక్సిలెరో మీటర్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న ఫోన్లకు దగ్గర్లో ఎక్కడైనా భూకంపం జరిగితే ఆ సమాచారం కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత.
ఉచిత యాప్ లు
ఆండ్రాయిడ్, ఐఓఎస్ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫామ్ లో పనిచేసే ఉచిత యాప్ లు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మైషేక్ గురించే ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఈ యాప్ 4.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తే వెంటనే సమాచారం ఇస్తుంది. భూకంపం వచ్చిన టైమ్, దాని వల్ల ప్రభావితం అయ్యే ప్రాంతాల గురించి గూగుల్ మ్యాప్స్ ని కూడా ప్రదర్శిస్తుంది. అంతే కాదు. భూకంప తీవ్రత ఇతర వివరాల గురించి వెంటనే డేటా సేకరిస్తుంది. దాన్ని విశ్లేషించి ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్ లు పంపిస్తుంది. అయితే దీని యాక్సెస్ కోసం మొబైల్ డేటా ఆన్ చేసి ఉంచడం, లేదా వైఫై కి కనెక్ట్ అయి ఉండటం తప్పనిసరి.
వివిధ సంస్థల హెచ్చరికలు
యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ అభివృద్ధి చేసిన లాస్ట్ క్వేక్ యాప్ కూడా ఇలాంటిదే. భూకంపాల గురించి హెచ్చరించే ట్రాకర్, భూకంప జోన్, రియల్ టైమ్ మ్యాప్ లను కూడా ఇది ఇస్తుంది. వియత్నాంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ కూడా భూకంపాలపై సమాచారం అందిస్తుంది. అమెరికాలోని జియోలాజికల్ సర్వే కూడా భూకంపాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తుంది.
హెచ్చరికలు ఎవరు పంపించినా, ఏ మార్గం ద్వారా వచ్చినా, మన ఫోన్ లోకే అవి వచ్చి చేరినా.. అప్పటికప్పుడు మనం రియాక్ట్ అయ్యే విధానంపైనే ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు, వస్తుందని తెలిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన పెంచితేనే ముప్పు కాస్త తగ్గుతుంది.