బంగారం విలువైన లోహం, అయితే భూమి మీద ఉన్న బంగారం చాలా పరిమితం. వీలైనంత వరకు దాన్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అంతకంటే సులభంగా బంగారం దొరికే మార్గం ఏదైనా ఉందా? ఏళ్ల తరబడి గనుల్లో కష్టపడి బంగారం ముడి ఖనిజాన్ని వెలికి తీసి శుద్ధి చేస్తే కొన్ని గ్రాముల స్వచ్ఛమైన బంగారం మాత్రమే లభిస్తుంది. ఈ వెలికితీత కష్టం అనుకుంటున్న క్రమంలో మానవాళికి మరో అరుదైన గని దొరికింది. అయితే ఆ గని భూమిపై కాదు, అంతరిక్షంలో ఉంది. టన్నులకొద్దీ బంగారం నిక్షిప్తమై ఉన్న ఆ గనిని కొల్లగొట్టేందుకు నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.
బంగారు గని ఎక్కడుంది..?
అంగారకుడు – గురుగ్రహం మధ్యలో ఉన్న గ్రహశకలం పూర్తిగా విలువైన లోహాలతో నిండి ఉందని నాసా కనుగొంది. బంగారం నికెల్, ఇతర విలువైన లోహాలు ఆ గ్రహశకలంలో ఉన్నాయి. దాని పేరు 16 సైకి. ఈ గ్రహశకలంలో ఉన్న బంగారం విలవ లెక్కగడితే అది 700 ట్రిలియన్ యూరోలను మించిపోతుందని అంటున్నారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 700 కోట్ల కోట్ల రూపాయలు. ఈ బంగారాన్ని భూమిపైకి తేవాలంటే ఏంచేయాలనేదే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతి పెద్ద సవాలు.
ఎలా తేవాలి..?
అంగారకుడు – గురు గ్రహం మధ్య ఒక ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంది. అందులో 16 సైకి గ్రహశకలం ఉంది. దాంతోపాటు మిగిలిన గ్రహశకలాల్లో కూడా పెద్ద మొత్తంలం బంగారం ఉండి ఉంటుందని అంచనాలున్నాయి. అయితే ప్రస్తుతం నాసా దృష్టి మొత్తం 16 సైకి పైనే ఉంది. గ్రహశకలంలో దొరికిన బంగారాన్ని ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తానికి పంచితే ప్రతి ఒక్కరు కోటీశ్వరులవుతారు. ఒక్కొకరికి 87.5 బిలియన్ యూరోలు లభిస్తాయి. అక్కడ బంగారం ఉంది సరే, దాన్ని భూమిపైకి తేవాలంటే ఎలా? ఏంచేయాలి? ఈ విషయాలపై నాసా శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అక్కడికి వెళ్లేందుకు సైకి ప్రోబ్ ను నాసా విడుదల చేసింది. ఇది 2029లో ఆ గ్రహశకలాన్ని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్ష మైనింగ్ లో ఇది పెద్ద ముందడుగు అని భావించవచ్చు.
అంతరిక్షంలో మైనింగ్..
ఇప్పటి వరకు భూమిపై జరిగిన మైనింగ్ ని మనం చూశాం. సముద్రం అడుగున కూడా అణ్వేషణలు కొనసాగుతున్నాయి. అయితే అంతరిక్షంలో ఉన్న అపార సంపదను ఒడిసిపట్టుకుంటే మరింత ఉపయోగం ఉంటుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. అరుదైన లోహాలు, అత్యంత విలువైన లోహాలు అంతరిక్షంలో గ్రహశకలాల రూపంలో ఉన్నాయి. అవి మానవాళికి లభిస్తే అద్భుతాలు చేయొచ్చు. అయితే వాటిని గుర్తించి, కనిపెట్టి, భూమిపైకి తీసుకురావడమే పెద్ద సవాల్. ఈ సవాల్ ని మానవాళి కచ్చితంగా అధిగమిస్తుందని అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. గ్రహశకలాన్ని భూమిపైకి తీసుకు రావడం, లేదా దాన్ని ధ్వంసం చేసి, కొంత మేరకు ఆ పదార్థాన్ని భూమిపైకి తీసుకు రావడం అసాధ్యం అనే వాదన కూడా వినపడుతోంది. అయితే అసలా గ్రహశకలం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని పసిగడితే.. అది మరిన్ని పరిశోధనలకు నాంది అుతుందని చెబుతున్నారు.