Karnataka News: బెంగళూరు సిటీని నిత్యం ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికితోడు దారుణమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ముందుగా గమనించిన సీఎం సిద్ధరామయ్య, దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ తగ్గించానికి ఒక్కటే మార్గమని అధికారులు సీఎంకు సలహా ఇచ్చారు.
ఆ ప్రాంతంలో ఉన్న విప్రో క్యాంపస్ ద్వారా పరిమిత వాహనాల రాకపోకలను అనుమతించడమే మార్గమని అధికారులు సూచన చేశారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెప్టెంబర్ 24న విప్రో అధినేత ప్రేమ్‌జీకి ఓ లేఖ రాశారు. ట్రాఫిక్ సమస్య సంక్లిష్టంగా ఉందని, రద్దీని తగ్గించడానికి సర్జాపూర్ విప్రో క్యాంపస్ ద్వారా వాహనాలు రాకపోకలకు అనుమతించాలని పేర్కొన్నారు.
దీనివల్ల రద్దీ దాదాపు 30 శాతం తగ్గుతుందన్నారు. క్యాంపస్ నుంచి అనుమతిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదనను విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సున్నితంగా తిరస్కరించారు. ట్రాఫిక్ కోసం తమ క్యాంపస్‌ను తెరిచినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని ఆయన అభిప్రాయపడ్డారు.
చట్టపరమైన సవాళ్లను ఉదహరించారు. సర్జాపూర్ క్యాంపస్ ప్రపంచ క్లయింట్లకు సేవలందిస్తోందన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి-SEZ కావడంతో పాలన-సమ్మతి కోసం కఠినమైన, చర్చించలేని యాక్సెస్ నియంత్రణ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ప్రైవేట్ ఆస్తి ద్వారా ప్రజా రవాణాను అనుమతించడం పరిష్కారం కాదన్నారు.
ALSO READ: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్టు గురించి తెలిస్తే
ఈ సమస్యకు డేటా ఆధారిత పరిష్కారం కనుగొనడానికి కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అందుకు బదులుగా బెంగుళూరులో అధ్వాన్నంగా మారుతున్న రద్దీని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
స్వల్ప-మధ్యస్థ, దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి పట్టణ రవాణా నిర్వహణలో ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన సంస్థ నేతృత్వంలో సమగ్ర అధ్యయనాన్ని ప్రారంభించాలన్నారు. అధ్యయనం ఖర్చులో విప్రో కొంత ఇస్తుందన్నారు. దీనిపై రాష్ట్ర అధికారులతో తదుపరి చర్చల కోసం కంపెనీ ప్రతినిధిని నియమించినట్లు పేర్కొన్నారు.
గతుకుల రోడ్లు, రోజురోజుకు పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో లాజిస్టిక్స్ టెక్నాలజీ సంస్థ బ్లాక్ బక్ సహ వ్యవస్థాపకుడు తమ బెల్లందూర్ తమ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ సోషల్ మీడియా ద్వారా వివరాలు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్, గుంతలు, దుమ్ముతో చాలా ఇబ్బంది కలుగుతోందని రాసుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ అడ్డంకుల పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది.