3D Printing:- ఒక కొత్త వస్తువును తయారు చేసి చూసే ముందు అసలు అది సరిగా పనిచేయగలదా లేదా, అందులో ఏర్పడే సాంకేతిక లోపాలు ఏమిటి అని శాస్త్రవేత్తలు ముందుగానే పసిగట్టేస్తున్నారు. ఇలా వస్తువు తయారీ కంటే ముందే అందులో వచ్చే సమస్యల గురించి తెలుసుకోవడానికి ఎన్నో టెక్నాలజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా తన సత్తాను చాటడానికి వచ్చేసింది.
3డీ ప్రింటింగ్ అనేది ఒక వస్తువు ఎలా ఉంటుంది. అందులో ఉండే పరికరాలు ఏంటి, అది పనిచేసే ప్రక్రియ ఏంటి అని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఉపయోగడుతుంది. ఇప్పటివరకు మెడికల్ రంగంలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. గత కొన్నేళ్లుగా ఇంకా ఎన్నో ఇతర రంగాల్లో కూడా దీని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో కొత్త రకమైన వస్తువులు, బొమ్మలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ తయారు చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించారు.
ఏ టెక్నాలజీ అయినా మార్కెట్లో ఫేమస్ అయ్యేవరకు అందరూ కొనదగే విధమైన ధరల్లో అందుబాటులో ఉండదు. అలాగే 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ధర కూడా ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది కాదు.. ఇప్పుడు దీని ధర కూడా చాలావరకు తగ్గిపోయింది. అందుకే ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలకు 3డీకి సంబంధించిన వస్తువులను అటాచ్ కూడా చేసి అవి మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఎలక్ట్రానిక్స్ రంగంలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి సాధించాల్సింది ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం చాలావరకు ఎలక్ట్రానిక్ పరికరాలకు సాలిడ్ స్టేట్‌లో ఉండే వైర్లు అటాచ్ అయ్యి ఉంటాయి. అవి ఇప్పుడు ఉన్న 3డీ ప్రింటింగ్ ఇంక్స్ ద్వారా ప్రింట్ చేయడం కష్టమయిపోతుంది. కానీ తాజాగా కొరియా శాస్త్రవేత్తలు ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టారు. 3డీ ప్రింటింగ్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే ఎలాస్టిక్ కంపోనేంట్స్‌ను తయారు చేశారు. ఈ ఎలాస్టిక్ వైర్లు అనేవి మరెన్నో ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగపడేలా మారుతుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
3డీ ప్రింటింగ్‌తో తయారు చేసిన ఎలాస్టిక్ కండక్టర్లు ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త మార్గాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికోసం కొత్త రకమైన ఇంక్‌ను తయారు చేశామని వారు బయటపెట్టారు. కండక్టర్ ఇలాస్టోమీర్‌లోని లిక్విడ్ కాంపోనెంట్స్‌తో పాటు, కరెంటును ఉత్పత్తి చేసే ఒక రబ్బర్ మెటీరియల్‌తో కలిసి ఈ ఇంక్‌ను తయారు చేశామన్నారు. ఇదే పద్ధతిలో సాఫ్ట్ ఎలక్ట్రానిక్స్ కూడా తయారు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.