WhatsApp Photo Scam: ఒక్క క్లిక్‌తో మీ డేటా గాల్లో కలిసిపోతుందంటే నమ్మగలరా?. అవును మీరు చదివింది నిజమే. ఇప్పుడు వాట్సాప్ నుంచి కొత్త స్కాం వచ్చింది. ఒకప్పుడు లింక్ క్లిక్ చేయమని బలవంతంగా మెసేజ్‌లు పంపేవారు, OTP అడిగే వారు. ఫేక్ అప్లికేషన్‌ల పేరుతో చీటింగ్ ఇలా చాలానే చూశాం. కానీ ఇప్పుడు సైబర్ నేరస్థులు మరింత తెలివిగా, తక్కువలో ఎక్కువ దెబ్బ కొట్టేలా స్కామ్‌లు రూపొందించారు. తాజాగా ఫోటో రూపంలో వచ్చిన ఈ మోసం గురించి తలచుకుంటేనే గుండె గుబులుమంటోంది.
ఇది ఎలా సాధ్యమవుతుంది
ఈ స్కామ్ వెనుక ఉన్న టెక్నాలజీ పేరు స్టెగానోగ్రఫీ. దీని సహాయంతో హానికరమైన కోడ్‌ను చిత్రాలలో దాచి ఉంచుతారు. ముఖ్యంగా “LSB స్టెగానోగ్రఫీ” అనే విధానంలో, డేటా చిత్రంలోని తక్కువ ముఖ్యమైన పిక్సెల్స్‌లో కప్పివేస్తారు. మీరు చూసే ఫోటో సాధారణంగా కనిపించినా, తెరవగానే మాల్వేర్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు మీ ఫోన్‌లోని పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, OTPలు అన్నీ నేరస్థుల చేతుల్లోకి వెటంనే వెళ్లిపోతాయి.
ఓ ఫోటో కోసం రెండు లక్షలు పోయాయి
ఈ స్కామ్ ఎంతటి తీవ్రమైనదో జబల్పూర్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తికి తెలియని నంబర్ నుంచి WhatsApp మెసేజ్ వచ్చింది. ఈ ఫోటోలో ఉన్నవారిని గుర్తించడంలో సహాయపడండి అని. ఆ వ్యక్తి తొలుత దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఆ నంబర్ నుంచి పదే పదే కాల్స్ వచ్చాయి. చివరకు అతను ఫోటోను ఓపెన్ చేయగానే అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలు మాయం అయ్యాయి. దీంతో అతను మోసపోయానని భావించి సైబర్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.
ఫోటో క్లిక్ చేస్తే ఫోన్ డేటా ఎలా పోతుంది?
సాధారణంగా మనకు తెలిసిన ఫిషింగ్ దాడులు లింక్ క్లిక్ చేయడాన్ని ఆధారపడి ఉంటాయి. కానీ ఇది అంతకన్నా భిన్నమని చెప్పవచ్చు. ఇక్కడ లింక్ అవసరం లేదు, లాగిన్ అవసరం లేదు. పంపించిన ఫోటో ఓపెన్ చేస్తే చాలు. మాల్వేర్ అంతర్గతంగా పనిచేస్తూ, అనుమతులు లేకుండానే అప్లికేషన్‌లకు యాక్సెస్ తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నేరస్థులు బాధితుడి ఫోన్‌ను రిమోట్‌గా కూడా నియంత్రించగలరు.
Read Also: Ambani Brothers: అప్పుల్లో ఉన్న తమ్ముడికి సహాయం చేయని …
ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి?
-ఈ స్కామ్‌లు ఎంత పద్ధతిగా ఉండాలో తెలిసాక, వాటిని ఎదుర్కొనే మార్గాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో మీ భద్రత కోసం ఇలాంటి జాగ్రత్తలు పాటించండి.
-అపరిచిత నంబర్‌ల నుంచి వచ్చిన చిత్రాలు క్లిక్ లేదా డౌన్‌లోడ్ చేయవద్దు. ఎంత వినయంగా వచ్చిన మెసేజ్ అయినా సరే, అపరిచిత వ్యక్తులు పంపిన ఫోటోలను ఓపెన్ చేయకండి. “ఒకరు తప్పిపోయారు”, “పెళ్లి ఫోటో”, “విశేష ఆహ్వానం” వంటి కామెంట్లతో మాయ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
-WhatsApp Auto-Download ఆపండి. సెట్టింగ్స్ > స్టోరేజ్ & డేటా > మీడియా ఆటో డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌కి వెళ్లి అన్ని ఆప్షన్లను ‘No Media’గా మార్చండి. ఇలా చేస్తే, ఏ మీడియా ఫైల్‌యినా మీ అనుమతి లేకుండా డౌన్‌లోడ్ కాదు.
-Truecaller వంటి ID యాప్స్ వినియోగించండి. కాల్ వచ్చిందంటే అసలు ఎవరు కాల్ చేస్తున్నారో ముందు తెలుసుకోండి. ఆ తర్వాత తెలిసిన వారు అయితే రిప్లై చేయండి.
-మార్కెట్‌లో ఉన్న విశ్వసనీయ యాంటీవైరస్ యాప్‌లు ఉపయోగించండి. BitDefender, Norton, Avast వంటి యాంటీవైరస్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. వీటిలోని రియల్ టైమ్ స్కానింగ్ ఫీచర్లు మీ పరికరాన్ని కాపాడతాయి.
-సైబర్ నేరాల గురించి వెంటనే కంప్లైంట్ చేయడం. ఏదైనా అనుమానాస్పద మెసేజ్, కాల్, లేదా లావాదేవీ జరిగిన వెంటనే https://cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా రిపోర్ట్ చేయండి.
-దీంతోపాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు దీని గురించి అవగాహన కలిగించండి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌కు కొత్తగా అలవాటు పడుతున్నవారికి ఈ మోసాల గురించి చెప్పండి. అవగాహనే అసలైన రక్షణ.