Ambani Brothers: అంబానీ కుటుంబం పేరు చెబితే చాలు. బిజినెస్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. నేడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేష్ అంబానీ ఉండగా, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం దివాలా ప్రకటించాల్సిన స్థితికి చేరారు. మరి ఇంతటి వ్యత్యాసానికి కారణమేంటి? అన్నతో గొడవలేనా? లేక వ్యాపార వేదికలపై తీసుకున్న తప్పిదాల ఫలితమా. అయితే అసలు అన్న ముఖేష్ అంబానీ.. అప్పుల్లో ఉన్న అనీల్ తమ్ముడికి ఎందుకు సాయం చేయడం లేదన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అంబానీ సోదరుల ప్రారంభ ప్రయాణం
ధీరూభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన కంపెనీల్లో ఒకటి. ఆయన పెద్ద కుమారుడు ముకేష్ అంబానీ 1981లో కంపెనీలో చేరగా, చిన్న కుమారుడు అనిల్ అంబానీ 1983లో ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ సక్సెస్‌ఫుల్ లీడర్స్‌గానే ఎదిగారు. కానీ, 2002లో ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత… రిలయన్స్ సామ్రాజ్యంలో విభజన ఎప్పుడెప్పుడా అన్నట్టు మొదలైంది. ముఖేష్ CMDగా బాధ్యతలు స్వీకరించగా, అనిల్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. 2004 నాటికి అంబానీ సోదరుల కలిసిన సంపద $6 బిలియన్‌కి చేరింది.
విభజనకు నాంది
కుటుంబవ్యవహారాల్లో ఉత్కంఠ నెలకొన్నప్పుడు చివరకు 2005లో అంబానీ బ్రదర్స్ రిలయన్స్ సామ్రాజ్యాన్ని పంచుకున్నారు. ముఖేష్‌కు మాతృక రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) దక్కగా, అనిల్ కు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ అనే సంస్థలు దక్కాయి. ఈ సమయంలో అనిల్ అంబానీ ఒక్కసారి ప్రపంచ ఆర్ధిక రంగంలోనే సునామీ లాంటి ఎదుగుదల చూపించారు. రిలయన్స్ పవర్ లిస్టింగ్ తర్వాత ఆయన నికర సంపద $42 బిలియన్లకు చేరింది. ఒక్కసారిగా ముకేష్ కంటే ఎక్కువ ధనవంతుడిగా అనిల్ నిలిచారు. కానీ ఇదంతా ఎక్కువ కాలం నిలువ లేదు.
వైఫల్యాల దారిలో అనిల్ అంబానీ
మార్కెట్ కు అనుగుణమైన మార్పులు అవసరం. కానీ అనిల్ తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు ఘోరమైనవిగా మిగిలాయి. ప్రత్యేకంగా టెలికాం రంగంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ పోటీకి నిలబడలేకపోయింది. వ్యాపార విస్తరణ కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడం… ఆపై తిరిగి వాటిని తిరిగి చెల్లించలేకపోవడం… అనిల్ వ్యాపార సామ్రాజ్యానికి భారంగా మారింది. ఇలా అప్పులు, కోర్టు కేసులు, డిఫాల్ట్‌లు వలన అనిల్ అంబానీ బిజినెస్‌కి నష్టం ఏర్పడింది. చివరకు 2020లో UK కోర్టులో దివాలా ప్రకటించాల్సి వచ్చింది. ఒకప్పుడు మిలియన్ల డాలర్లతో మెరిసిన వ్యక్తి… ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయాడు.
రాజకీయ ప్రయాణం కూడా!
ఆర్థిక రంగంతో పాటు రాజకీయాల్లో కూడా అనిల్ అంబానీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2004-2006 మధ్య కాలంలో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కానీ, అక్కడ కూడా ఆయన పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు.
Read Also: Fast Battery Draining: మీ మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా …
2025 నాటికి పరిస్థితి ఎలా ఉంది?
మార్చి 10, 2025 నాటికి అనిల్ అంబానీ నికర విలువ కేవలం $530 మిలియన్లుగా ( అంచనా వేయబడింది. ఇది గతపు గర్వించదగిన $42 బిలియన్ తో పోలిస్తే విపరీతంగా తక్కువ. ప్రస్తుతం అనిల్ కు చెందిన కీలకమైన సంస్థ “రిలయన్స్ క్యాపిటల్” అప్పుల బాధ నుంచి బయటపడేందుకు అమ్మకానికి నిలబడింది.
రుణదాతల బకాయిలు
ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్‌కు చెందిన “ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL)” అత్యధిక బిడ్ వేసింది. బ్యాంకులో కంపెనీ వాటాను 15% నుంచి 26%కి పెంచేందుకు అనుమతులు కూడా పొందినట్లు కంపెనీ చైర్మన్ అశోక్ హిందూజా ప్రకటించారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI నుంచి ఆమోదం లభించిన తర్వాత రుణదాతల బకాయిలు చెల్లించనున్నట్లు సమాచారం.
అన్న ముకేష్ అంబానీ ఎందుకు సహాయం చేయలేదు?
ఒకప్పుడు ఒక్కసారిగా అంత ధనవంతుడు అయిన తమ్ముడు ఇప్పుడు అప్పుల్లో మునిగిపోతుంటే… అన్న అయిన ముకేష్ అంబానీ ఎందుకు సహాయం చేయలేకపోతున్నారు? ముకేష్ వద్ద వనరులు లేవా? లేదా వ్యక్తిగత విభేదాలే కారణమా. ఇది నేటికీ ఓ మిస్టరీ అని చెప్పవచ్చు. అయితే, పరిశీలకులు చెబుతున్నది ఏంటంటే… 2005 విభజన తరువాత ఇద్దరూ బిజినెస్ పరంగా పూర్తిగా వేర్వేరు అయ్యారు. ఎవరికి వారు వ్యాపార రంగంలో వారి ప్రాధాన్యతలను నిర్వహించుకున్నారు.
భారం నుంచి కాపాడితే
అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఆవిష్కృతంగా లేవు. కుటుంబస్థాయిలో సంబంధాలు ఉన్నా, బిజినెస్ లెవల్లో మాత్రం ఎలాంటి మద్దతు లభించలేదు. అలాగే, రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు పూర్తిగా ముఖేష్ కుటుంబం ఆధీనంలో ఉంది. ముకేష్ అంబానీ వ్యాపారంగా తమ బాధ్యతను మాత్రమే చూసుకుంటున్నారు. ఆర్థికంగా తమ్ముడిని ఆదుకోవడం అనేది వ్యాపార ప్రొఫెషనలిజానికి విరుద్ధంగా భావించవచ్చు. పైగా అనిల్ కంపెనీలు కోర్టులో దివాలా ప్రక్రియలో ఉండటం వల్ల ముకేష్ చేయగలిగే సహాయం కూడా చట్టపరంగా పరిమితమవుతుందని సమాచారం. కానీ ముఖేష్ ప్రస్తుతం అప్పుల్లో ఉన్న తమ్ముడిని భారం నుంచి కాపాడితే అంబానీ ఫ్యామిలీ పరువుతోపాటు తన సోదరుడిని ఆదుకున్న పేరు కూడా దక్కుతుందని పలువురు చెబుతున్నారు.