ISRO NISAR Satellite: ఒక ఉపగ్రహం… భూమిపై జరిగే చిన్నపాటి కదలికల నుంచీ, అతిపెద్ద ప్రకృతి విపత్తుల దాకా గమనించగలదంటే? ఇంకా చెప్పాలంటే.. అది రాత్రి, పగలు అనే తేడా లేకుండా, అడవులు, మంచు, కొండల మధ్య దాగిన మార్పులన్నీ తెలుసుకుంటుందంటే? ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు.. సూపర్ సక్సెస్. అంతరిక్షంలోకి ప్రయాణానికి రెడీగా నిలిచిన ఓ అద్భుత శాస్త్రీయ సాధనం గురించి తెలుసుకుంటే, మీరు కూడా ఆశ్చర్యపోతారు. అదేదో కాదు.. దాని పేరే నిసార్ శాటిలైట్. ఇస్రో ప్రయోగించిన ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, ప్రయోగం సక్సెస్ అయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఇది భూమిపై జరిగే మార్పులను అత్యంత ఖచ్చితంగా గుర్తించగలిగే శాటిలైట్. నిసార్ అంటే NASA-ISRO Synthetic Aperture Radar. ఈ శాటిలైట్ ప్రాజెక్ట్‌ను ఇస్రో (ISRO), నాసా (NASA) కలిసి రూపొందించాయి. భూమిపై సంభవించే ప్రకృతి విపత్తులను ముందే గుర్తించడానికి, వాతావరణం మార్పులను విశ్లేషించడానికి ఇది కీలకంగా మారనుంది.
నిసార్ ప్రత్యేకతలు ఇవే!
నిసార్ ప్రత్యేకత దాని డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్. ఇందులో నాసా తయారు చేసిన ఎల్-బ్యాండ్, ఇస్రో తయారు చేసిన ఎస్-బ్యాండ్ రాడార్లు ఉంటాయి. ఇవి అడవులు, మంచు, నేల వంటి ఘనమైన పదార్థాల్లో కూడా చొచ్చుకెళ్లగల రేడియో తరంగాలపై పనిచేస్తాయి. ఈ రెండు రాడార్లు కలిసి ఒకేసారి పని చేస్తూ, భూమిపై అత్యంత ఖచ్చితమైన, సెంటీమీటర్ స్థాయిలో మార్పుల్ని కనిపెడతాయి.
భూమి చుట్టూ 97 నిమిషాలకు ఒకసారి!
నిసార్ ఉపగ్రహం 2,392 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఇది 97 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. రోజుకు సుమారు 80 టెరాబైట్ల డేటాను రూపొందించగలదు. దీనితో, భూమిపై ప్రతీ ప్రాంతాన్ని 12 రోజులకోసారి స్కాన్ చేసే సామర్థ్యం ఉంది. ఈ ఉపగ్రహంలో SWOT SAR అనే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించబడుతుంది. దీని ద్వారా ఒకేసారి 240 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని స్కాన్ చేయగలదు. అంతేకాదు, ఈ వ్యవస్థ త్రీడీ చిత్రాలు అందించగలదు. ఇది భూమిపై సాగుతున్న మార్పులను స్పష్టంగా గ్రహించేందుకు సహాయపడుతుంది.
నిసార్ శాటిలైట్ పలు రంగాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. పంటల ఎదుగుదల, నేలలో తేమ స్థాయి, చిత్తడి నేలల్లో మార్పులు ముందే చెప్పనుంది. అటవీ విస్తీర్ణం మార్పులు, పచ్చదనం తగ్గుముఖం, ధ్రువ ప్రాంతాల్లో మంచు కదలికలు, సముద్ర మట్టంలో పెరుగుదల, అగ్నిపర్వతాలు, కొండచరియలు, భూకంపాల సూచనలు, డ్యామ్‌లు, వంతెనల్లో లోపాల గుర్తింపును ఇట్టే చెప్పేస్తుంది నిసార్.
Also Read: IRCTC updates: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి.. రైళ్లకు జనరల్ బోగీల పెంపు.. ఎప్పుడంటే?
ప్రాజెక్ట్ ఖర్చు తక్కువే!
ఈ భారీ ప్రాజెక్టు ఖర్చు రూ.11,200 కోట్లు. ఇందులో ఇస్రో వాటా సుమారు రూ.800 కోట్లు మాత్రమే. దీన్ని సాధించడంలో ఇస్రో తక్కువ ఖర్చుతో అధునాతన ఇంజినీరింగ్‌ను వినియోగించింది. అదే దీనిని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారతదేశం అంతరిక్ష రంగంలో ఎలా ముందుకు దూసుకుపోతుందో నిసార్ ఉదాహరణగా నిలుస్తోంది.
పదేళ్ల శ్రమ..
ఈ మిషన్‌కు పునాదులు 2014లోనే వేసారు. దాదాపు పదేళ్లుగా ఇస్రో – నాసా శాస్త్రవేత్తలు కలిసి పని చేస్తూ దీనిని రూపుదిద్దారు. ఇది కేవలం ఒక శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు. ఇది మానవాళి భవిష్యత్తుకు అవసరమైన డేటాను అందించే కీలకమైన సాధనం. ఈ శాటిలైట్ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, పర్యావరణ అధ్యయనం, వాతావరణ మార్పుల విశ్లేషణ వంటి ఎన్నో రంగాల్లో ఉపయోగపడనుంది. దీనితో శాస్త్రవేత్తలు మాత్రమే కాక, రైతులు, పాలనాధికారులు, వాతావరణ నిపుణులు.. అందరికీ అద్భుతమైన సమాచారం అందనుంది.
ఈ అద్భుత ప్రయోగం ఈ రోజు (జూలై 30) సాయంత్రం 5:40 గంటలకు, శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రయోగం సక్సెస్ అయింది. ప్రపంచం మొత్తం ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనించి శాస్త్రవేత్తలకు జేజేలు పలుకుతున్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, నిసార్ ఉపగ్రహం కేవలం ఒక సాంకేతిక కృషి కాదు.. అది భూమిని, మన జీవితాలను, మన భవిష్యత్తును బాగా అర్థం చేసుకునేందుకు ఓ బలమైన అద్దం లాంటిది!