Nothing Ear (note): సాధారణంగా ఇయర్‌బడ్స్ అంటే పాటలు వినడం, ఫోన్ కాల్స్ మాట్లాడటమే గుర్తుకు వస్తాయి. కానీ ప్రముఖ నథింగ్ తీసుకొస్తున్న కొత్త Ear (note) ఈ ఆలోచనను కొంచెం మార్చేలా కనిపిస్తోంది. వచ్చే నెలలో పరిచయం కానున్న ఈ డివైస్‌లో రికార్డింగ్, మాటలను టెక్స్ట్‌గా మార్చడం, ముఖ్యమైన విషయాలను సారాంశంగా చూపించడం వంటి ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఫోన్ కాల్స్‌తో పాటు మన ఎదురుగా జరిగే సంభాషణలను కూడా రికార్డ్ చేయగలదని సమాచారం. ఈ ఫీచర్లు రోజువారీ పనుల్లో ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. నథింగ్ సీఈఓ కార్ల్ పీ ఈ ఇయర్‌బడ్స్‌ను ముందుగానే చూపించారు. డిసెంబర్ 8న వీటిని లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ టీజర్లలో ఇప్పటివరకు స్క్రీన్ లేని ఒక కొత్త డివైస్‌ను చూపించగా, ఇప్పుడు అది ఇయర్‌బడ్స్ అని స్పష్టమైంది. మెటాలిక్ ఫినిష్, గుండ్రని అంచులతో ఉండే ఈ డివైస్ డిజైన్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది.
ఈ ఇయర్‌బడ్స్ కేస్‌లోనే మైక్రోఫోన్లు ఉంటాయని సమాచారం. వాటితో మన ఎదురుగా జరిగే మీటింగ్‌లు, మాట్లాడుకునే విషయాలను రికార్డ్ చేయవచ్చు. కేస్‌పై టాక్ బటన్ కూడా ఉంటుంది. దాన్ని నొక్కి మన మాటలను రికార్డ్ చేయొచ్చు. భవిష్యత్తులో ఈ బటన్‌కు మరిన్ని పనులు కేటాయించే అవకాశం ఉందని కార్ల్ పీ తెలిపారు. ఇయర్‌బడ్స్ ద్వారా ఫోన్ కాల్స్‌ను కూడా రికార్డ్ చేయవచ్చని తెలుస్తోంది.
Also Read: BSNL క్రేజీ ఆఫర్.. రూ.399కే 60 Mbps స్పీడ్, 3,300GB డేటా.. పైగా మొదటి నెల బిల్లు ఫ్రీ!
వాయిస్ కమాండ్స్‌తో వివిధ ఏఐ ఏజెంట్లను ఉపయోగించే సదుపాయం ఇందులో ఉండొచ్చు. నథింగ్ సొంత వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌ను తయారు చేస్తోంది. అయితే ఒక్క కంపెనీ ఏఐకే పరిమితం కాకుండా ఇతర ఏఐ ఏజెంట్లకు కూడా సపోర్ట్ ఇవ్వాలని చూస్తోంది. ఫోన్‌లోని కంపానియన్ యాప్‌లో రికార్డింగ్స్ సేవ్ అవుతాయి. వాటి ట్రాన్స్‌క్రిప్ట్‌లు, ముఖ్యమైన పాయింట్లతో కూడిన సారాంశాలు కూడా అక్కడే కనిపిస్తాయి.
సంభాషణలను రికార్డ్ చేసే ఫీచర్‌తో ప్రైవసీపై సందేహాలు రావడం సహజం. ఈ విషయంలో పోటీ ఉత్పత్తుల తరహా ప్రైవసీ సర్టిఫికేషన్లు తీసుకోవడం, న్యాయ నిపుణుల సలహాలు పొందడం వంటి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. లండన్‌లో ప్రత్యేక డేటా, సెక్యూరిటీ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసిందట. ఈ ఉత్పత్తి ప్రస్తుతం ప్రత్యేక వర్గం వినియోగదారులకే ఆసక్తి కలిగించవచ్చని కంపెనీ భావిస్తోంది. అయినా, ఒకే డివైస్‌తో కాల్స్, ప్రత్యక్ష సంభాషణలు రికార్డ్ చేసి, వాటి సారాంశం పొందే అవకాశం దీనికి ప్రత్యేకత ఇవ్వొచ్చు. ధర, బ్యాటరీ సామర్థ్యం, అందుబాటులో ఉండే దేశాల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Also Read: వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?