Singareni Education: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం దిశగా సింగరేణి యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఉచిత విద్యను ప్రవేశపెట్టడం విశేషం. ప్రస్తుతం సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని 9 పాఠశాలల్లో చదువుతున్న 400 మందికి పైగా పిల్లలకి తక్షణమే ఇది వర్తించనుంది.
అన్ని ఏరియాలకు ఉత్తర్వులు జారీ..
వచ్చే సంవత్సరం నుంచి వీరితో పాటు కొత్తగా చేరబోయే కాంట్రాక్టు కార్మికుల పిల్లలకి కూడా ఈ సౌకర్యం వర్తించనుంది. ఈ మేరకు సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ అన్ని ఏరియాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం సింగరేణి ప్రాంతాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల పిల్లలకు ఆయా ప్రాంతాల్లోని సింగరేణి పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పించడంతో పాటు పదో తరగతి వరకు ఉచితంగా విద్య అందించనున్నారు. ఈ నిర్ణయంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగరేణి విద్యా సంస్థల్లో కాంట్రాక్టు కార్మికుల పిల్లల ప్రవేశ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
కావాల్సిన డాక్యుమెంట్లు..
ఈ సదుపాయాన్ని పొందాలనుకునే కాంట్రాక్టు కార్మికులు తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తమ పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌లను సంబంధిత సింగరేణి శాఖాధిపతుల ద్వారా ధ్రువీకరించి సమర్పించాలని సింగరేణి విద్యాశాఖ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గుడ్ న్యూస్..
సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో, సింగరేణి పాఠశాలల్లో తమ పిల్లలకు పదో తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే అవకాశం కలగడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా బోనస్‌ను చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రూ.5,500 బోనస్ చెల్లించగా.. తాజాగా కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందించే నిర్ణయం తీసుకోవడంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత లభించినట్లయింది. ఈ నిర్ణయం పట్ల ఔట్ సోర్సింగ్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు