Dry prawns brinjal curry: మనం ఇంట్లో తరచూ చేసుకునే సాధారణ కూరలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా నాలుకకు కొత్త రుచి కావాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ముఖ్యంగా కోస్తా ఆంధ్రా ప్రాంతాలలో దీనికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పప్పు రొయ్యలు అంటే పొట్టు తీసిన ఎండు రొయ్యలు. వీటిని లేత వంకాయలతో కలిపి వండితే.. రుచి అద్భుతంగా ఉంటుంది.చాలా మంది ఎండు రొయ్యలు వండాలంటే నీచు వాసన వస్తుందని భయపడుతుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. రెస్టారెంట్ లెవెల్ టేస్ట్ ఇంట్లోనే తీసుకురావచ్చు.ఇంతకీ ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్టు తీసిన పప్పురొయ్యలు- ఒక కప్పు
లేత నల్ల వంకాయలు- పావు కిలో
పెద్ద ఉల్లిపాయలు-రెండు
పండు టమాటాలు-రెండు
పచ్చిమిర్చి-నాలుగు
కరివేపాకు-తగినంత
కొత్తిమీర-తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్
పసుపు- అర స్పూన్
కారం,ఉప్పు- రుచికి సరిపడా
ధనియాల పొడి- ఒక స్పూన్
జీలకర్ర పొడి -అర స్పూన్,
గరం మసాలా -పావు స్పూన్
వంట నూనె- మూడు టేబుల్ స్పూన్లు
1.వంట తయారీకి ముందే రొయ్యలను క్లీన్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా రొయ్యలలో ఏమైనా చెత్త , రాళ్లు ఉండే ఏరివేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో రొయ్యలను కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయి. ఆ తర్వాత వేయించిన రొయ్యలను గోరువెచ్చని నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టి 3లేదా 4 సార్లు కడిగి నీరు పిండేసి పక్కన పెట్టుకోవాలి.
2.తర్వాత వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెంటనే ఉప్పు వేసిన నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి, అలాగే చేదు కూడా రావు.
3.ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిట పట లాడనివ్వాలి. తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి.
Also Read: లెమన్ ఫిష్ రెసిపీ..తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి!
4.తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పప్పురొయ్యలను కడాయిలో వేసి రెండు నిమిషాల పాటు నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా పప్పు రొయ్యలు నూనెలో మంచిగా వేగితేనే కూరకు అసలైన రుచి వస్తుంది. ఆ తర్వాత తరిగిన టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
5.టమాటోలు మగ్గిన తర్వాతవంకాయ ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి . ఇప్పుడు తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వంకాయ ముక్కలకు పట్టేలా రెండు నిమిషాలు వేయించాలి.ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం మంటపై ఉడికించాలి. వంకాయలు మెత్తగా ఉడికి, గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలేటప్పుడు గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే.. గుమగుమలాడే పప్పురొయ్య వంకాయ కూర రెడీ అవుతుంది. దీనిని వేడివేడి అన్నం, చపాతీలోకి తింటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం. జొన్న రొట్టెలకు ఇది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ సండే మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి.