PhonePe Wallet: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్‌లోనూ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్స్‌లో ‘ఫోన్‌పే’ (PhonePe) ముందంజలో ఉంది. అయితే, ఫోన్‌పే సేవలను వినియోగించే కస్టమర్లు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సి ఉంది. మీరు ఫోన్‌పే వాలెట్ (PhonePe Wallet) వాడుతూ, గత కొన్ని నెలలుగా దాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేసి ఉంటే.. మాత్రం మీకు షాక్ ఇవ్వనుంది ఫోన్ పే. అలా చేసినందుకు రూ. 100 ఛార్జీ పడే అవకాశం ఉంది.
ఫోన్‌పే తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. వరుసగా 365 రోజుల పాటు (అంటే ఒక సంవత్సరం) మీ ఫోన్‌పే వాలెట్‌లో ఎలాంటి లావాదేవీలు జరపకపోతే, ఆ వాలెట్ అకౌంట్‌ను ‘ఇన్‌యాక్టివ్’ ఖాతాగా పరిగణిస్తారు. అలా నిలిచిపోయిన ఖాతాల నిర్వహణ కోసం కంపెనీ రూ. 100 వరకు ‘వాలెట్ మెయింటెనెన్స్ ఫీజు’ లేదా పెనాల్టీని విధించనుంది.
Read also-సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!
ఈ కొత్త నిబంధన కేవలం ఫోన్‌పే వాలెట్ ఉపయోగించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఏడాది పొడవునా వాలెట్ ద్వారా డబ్బులు యాడ్ చేయడం, రీఛార్జ్‌లు చేయడం, లేదా ఎవరికైనా పేమెంట్స్ చేయడం వంటివి ఏవీ చేయకపోతేనే ఈ ఫీజు కట్ అవుతుంది. అయితే, ఇక్కడ కస్టమర్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ రూ. 100 పెనాల్టీ అనేది కేవలం మీ ఫోన్‌పే వాలెట్‌లో బ్యాలెన్స్ ఉంటేనే అందులో నుండి కట్ అవుతుంది. ఒకవేళ మీ వాలెట్‌లో రూ. 50 మాత్రమే ఉంటే, ఆ రూ. 50 కట్ చేసుకుని వాలెట్ బ్యాలెన్స్‌ను సున్నా (Zero) చేస్తారు. మీ వాలెట్ బ్యాలెన్స్ ముందే సున్నా ఉంటే, ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. అంతేకాకుండా, దీని కోసం మీ బ్యాంక్ అకౌంట్ నుండి విడిగా డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ లేదు.
ఆర్బీఐ (RBI) గైడ్‌లైన్స్ ప్రకారం చాలా కాలం పాటు వాడకుండా ఐడిల్‌గా ఉన్న డిజిటల్ వాలెట్లను భద్రతా కారణాల దృష్ట్యా ఇన్‌యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఖాతాల నిర్వహణ వ్యయాన్ని అధిగమించేందుకు కంపెనీలు ఈ తరహా ఫీజులను విధిస్తుంటాయి.
Read also-వర్షాకాలంలో మీ టూవీలర్ స్టార్ట్ అవ్వడంలేదా?.. అయితే ఇలా ట్రై చేసి చూడండి..
ఈ రూ. 100 ఛార్జీ నుండి సులభంగా తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
చిన్న లావాదేవీ: ఏడాది పూర్తి కాకముందే మీ వాలెట్ నుండి కనీసం ఒక రూపాయి లేదా పది రూపాయల ట్రాన్సాక్షన్ చేయండి. ఏదైనా చిన్న రీఛార్జ్ లేదా దుకాణాల్లో వాలెట్ ద్వారా పేమెంట్ చేస్తే మీ ఖాతా మళ్లీ యాక్టివ్ అవుతుంది.
మనీ లోడ్ చేయడం: మీ బ్యాంక్ ఖాతా నుండి కొద్దిపాటి మొత్తాన్ని వాలెట్‌లోకి యాడ్ చేయడం ద్వారా కూడా వాలెట్ యాక్టివ్‌గా మారుతుంది.
వాలెట్ క్లోజ్ చేయడం: అసలు మీకు ఫోన్‌పే వాలెట్ అవసరమే లేదు అనుకుంటే, యాప్‌లోకి వెళ్లి వాలెట్‌ను పూర్తిగా క్లోజ్ చేసుకోవచ్చు. అలా క్లోజ్ చేసినప్పుడు వాలెట్‌లో మిగిలి ఉన్న డబ్బు నేరుగా మీ లింక్డ్ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది.
ముఖ్య గమనిక ఏంటంటే, ఈ నిబంధన కేవలం ‘ఫోన్‌పే వాలెట్’కు మాత్రమే పరిమితం. మీరు సాధారణంగా రోజువారీ చేసే ఫోన్‌పే యూపీఐ (UPI – బ్యాంక్ టు బ్యాంక్) లావాదేవీలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. యూపీఐ పేమెంట్లు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి. కాబట్టి మీ ఫోన్‌పే వాలెట్‌లో డబ్బులు ఉండి, చాలా రోజులుగా వాడకుండా ఉంటే, వెంటనే ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసి పెనాల్టీ పడకుండా జాగ్రత్తపడండి.