Postpartum Depression:- డిప్రెషన్ అనేది గత కొన్నేళ్లుగా మనుషులకు పీడిస్తున్న ఒక మానసిక సమస్య. డిప్రెషన్ అనేది మనిషిని ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయినా వెనకాడనివ్వదు. ముఖ్యంగా తమరికి తాముగా హాని చేసుకోవడానికి డిప్రెషన్‌లో ఉన్న పేషెంట్లు ఏ మాత్రం ఆలోచించరు. అందుకే దీనిని తీవ్రమైన వ్యాధిగా పరిగణిస్తారు. తాజాగా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటే ప్రసవానంతరం కలిగే డిప్రెషన్.. మహిళల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు తేల్చారు.
మామూలుగా ప్రసవం తర్వాత చాలావరకు మహిళలు డిప్రెషన్‌లోకి వెళ్లడం సహజమే అని వైద్యులు ఎప్పుడో నిర్ధారించారు. కానీ కొందరు మహిళలపై ఈ ప్రభావం జీవితాంతం ఉంటుందని శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో తేలింది. ముందుగానే ఈ డిప్రెషన్‌ను గుర్తిస్తేనే దీనికి తగిన చికిత్సను అందించవచ్చని చెప్తున్నారు. ఒకవేళ ముందుగానే గుర్తించి పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు తగిన చికిత్స అందించకపోతే మాత్రం ఇది డిప్రెసివ్ డిసార్డర్‌కు దారితీస్తుందని తెలిపారు.
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది కేవలం మహిళపై మాత్రమే కాదు.. పూర్తిగా వారి కుటుంబంపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ డిప్రెషన్‌కు సరైన కారణాలు ఏంటని ఎవరూ పూర్తిగా చెప్పలేరని అన్నారు. అందరూ చెప్పినట్టుగా తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తానో లేదో.. ఒక మంచి తల్లిగా ఉండగలుగుతానో లేదో అన్న ఆలోచన ఎక్కువగా మహిళలు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ను గురయ్యేలా చేస్తాయని తెలిపారు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి చికిత్సను అందించగలిగితే మూడు నెలల్లో పేషెంట్ కోలుకుంటారని బయటపెట్టారు.
శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న ఈ డిప్రెషన్‌ను గుర్తించడం కోసం ఒక స్క్రీనింగ్ టూల్‌ను కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారు చేసే ఈ ప్రయోగం ఎంతోమంది మహిళలను పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ నుండి కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వల్ల ఆత్మహత్య లాంటి నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య తక్కువే అయినా దీనివల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.