భవిష్యత్ తరాలకోసం మనం కొన్ని పురాతన వస్తువుల్ని భద్ర పరుస్తుంటాం. కాలక్రమంలో అవే మ్యూజియంలలో దర్శనమిస్తుంటాయి. అలాగే భవిష్యత్ అవసరాలకోసం శాస్త్రవేత్తలు కూడా కొన్ని వస్తువుల్ని, పదార్థాలను దాచిపెడుతుంటారు. ప్రళయం సంభవిస్తే, భూమిపై ఉన్న సకల జీవరాశులూ నశిస్తే.. ఆ తర్వాత మానవుని ఉనికి ఏమవుతుంది. ప్రళయాన్ని తట్టుకుని బతికే ఒక్కరో ఇద్దరో ఎలా జీవిస్తారు..? దేన్ని ఆహారంగా తీసుకుంటారు..? ఇలాంటి ప్రశ్నలకు జవాబుగా శాస్త్రవేత్తలు కొన్ని ఆహార పదార్థాలను జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. మొక్కల నమూనాలు, విత్తనాలు, ఇతర ఆహార పదార్థాలను అత్యంత శీతలీకరణ పరిస్థితుల్లో ప్యాక్ చేసి ధృవ ప్రాంతాల్లోని ప్రత్యేక ల్యాబొరేటరీల్లో భద్రపరుస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇటీవల ఈ లిస్ట్ లో మానవ మలం కూడా చేరింది. అవును, మీరు చదువుతున్నది నిజమే. మానవ మల పదార్థాన్ని భద్రంగా దాచి పెడుతున్నారు శాస్త్రవేత్తలు.
ఎందుకు..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యాంటీబయోటిక్ ల వినియోగం పెరిగింది. కొన్ని సూక్ష్మ జీవులు సమూలంగా అంతరిస్తున్నాయి. అయితే వీటిలో మానవ మనుగడకు అవసరమైన సూక్ష్మ జీవులు కూడా ఉన్నాయి. మానవ జీవ క్రియకు అవసరమైనవి కూడా ఉన్నాయి. పరిశోధనల పుణ్యమా అని సూక్ష్మజీవి వినాశకాలు ఎక్కువగా వినియోగిస్తున్న మానవుడు, తన అంతానికి తానే స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు. అదే జరిగితే మానవులకు అవసరమైన సూక్ష్మ జీవులు పూర్తిగా అంతరించి మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈ విపత్కర పరిణామం జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ సమయానికి పనికొచ్చేలా ఇప్పట్నుంచే ఆ సూక్ష్మ జీవుల్ని దాచిపెడుతున్నారు. అత్యంత శీతల వాతావరణంలో వాటిని భద్రపరుస్తున్నారు.
ఎలా..?
సూక్ష్మ జీవులను నేరుగా భధ్రపరచలేం. అందుకే మానవ మలాన్ని గడ్డకట్టించి, అందులో ఉన్న సూక్ష్మ జీవుల్ని భద్రపరుస్తున్నారు శాస్త్రవేత్తలు. 2018లో ఈ ప్రాజెక్ట్ మొదలు కాగా, 2029నాటికి పూర్తి చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఇప్పటి వరకు వెయ్యికంటే ఎక్కువమంది నుంచి మలం శాంపిల్స్ తీసుకుని భద్రపరిచారు. మొత్తం 10వేల మలం నమూనాలను భద్రపరిచేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు.
ఎక్కడ..?
స్విట్జర్లాండ్ లోని ఓ ల్యాబ్ లో ఈ నమూనాలను భద్రపరుస్తున్నారు. మైనస్ 80 డిగ్రీల సెంటీగ్రేట్ వద్ద వీటిని ఉంచుతారు. నార్వేలోని స్వాల్ బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ లో భవిష్యత్ తరాలకోసం విత్తనాలను భద్రపరుస్తున్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని మైక్రోబయోటా వాల్ట్ అనే పేరుతో స్విట్జర్లాండ్ లో మలం నమూనాలను భద్రంగా ఉంచుతున్నారు. భవిష్యత్ తరాల అవసరాలకోసం తాము ఈ పని చేస్తున్నట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మానవ మలంతోపాటు పులియబెట్టిన ఆహారాన్ని కూడా గట్టి కట్టించి నిల్వ చేస్తున్నారు. ఇందులో కూడా అనేక సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిని కూడా భవిష్యత్ తరాల అవసరాలకోసం నిల్వ చేస్తున్నట్టు చెబుతున్నారు. మానవ కార్యకలాపాల వల్ల త్వరలోనే సూక్ష్మ జీవులు అంతరించిపోతాయని, అయితే ఈ పరిణామం వల్ల మంచితోపాటు, చెడు కూడా జరుగుతుందని వీరు అంచనా వేస్తున్నారు. అందుకే సూక్ష్మ జీవుల్ని భవిష్యత్ తరాలకోసం దాచి పెడుతున్నట్టు ప్రకటించారు.