Refrigerator water leakage: ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ అవసరంగా మారిపోయింది. ఆహార పదార్థాలను తాజాగా ఉంచడానికి ఇది ఎంతో సహాయ పడుతుంది.అయితే రోజూ వాడే క్రమంలో కొన్ని సార్లు ఫ్రిజ్ కింద నీరు కారడం లేదా వెజిటబుల్ బాక్స్ కింద నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్ రాగానే మనం కంగారు పడిపోయి సర్వీస్ సెంటర్‌కి కాల్ చేస్తాం. కానీ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగిస్తే.. టెక్నీషియన్ అవసరం లేకుండానే మీ చేతులతో ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఫ్రిజ్‌లో నీరు చేరడానికి అసలు కారణాలు, వాటిని సరి చేసే పద్ధతులు ఇప్పుడు చూద్దాం.
ఫ్రిజ్‌లో నీరు చేరడానికి 90 శాతం ప్రధాన కారణం డ్రైన్ హోల్ బ్లాక్ అవ్వడమే. ఫ్రిజ్ లోపలి గోడల వెనక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఫ్రిజ్ డీఫ్రాస్ట్ అయ్యే సమయంలో వచ్చే అదనపు నీరు ఈ రంధ్రం గుండా బయటికి వెళ్లాలి. కానీ ఆహార కణాలు, దుమ్ము లేదా ఐస్ పేరుకుపోవడం వల్ల ఈ హోల్ మూసుకుపోతుంది.దీని వల్ల నీరు బయటకు పోలేక ఫ్రిజ్ లోపల లేదా కిందకి లీక్ అవుతుంది.
ఈ సమస్యను పరిష్కరించడం చాలా ఈజీ. ముందుగా ఫ్రిజ్‌లోని పవర్ ప్లగ్‌ను ఆఫ్ చేయండి. ఫ్రిజ్ లోపల ఉన్న వెజిటబుల్ బాక్స్‌ను బయటికి తీయండి. తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న డ్రైన్ హోల్‌ని గుర్తించండి. ఒక చిన్న ఇయర్ బడ్, టూత్‌పిక్ లేదా సన్నని ప్లాస్టిక్ వైర్‌ను ఉపయోగించి ఆ హోల్‌లో ఉన్న చెత్తను మెల్లగా బయటకు తీయండి.ఆ తర్వాత కొద్దిగా గోరు వెచ్చని నీటిని ఆ హోల్‌లో పోస్తే.. లోపల ఉన్న ఐస్ కరిగి దారి పూర్తిగా క్లియర్ అవుతుంది.
ఫ్రిజ్ లోపలి నుంచి వచ్చే నీరు కింద ఉండే ఒక చిన్న ట్రేలోకి వెళ్లాలి. కొన్ని సార్లు ఈ డ్రైన్ పైప్ లేదా ట్రే స్థానం తప్పుతుంది లేదా అందులో మురికి పేరుకు పోతుంది. ఫ్రిజ్ వెనకభాగాన్ని కొద్దిగా పరిశీలిస్తే.. ఈ ట్రే కనిపిస్తుంది. దానిని శుభ్రంగా కడిగి మళ్లీ సరిగ్గా ఫిట్ చేస్తే.. లీకేజ్ ఆగిపోతుంది.
ఫ్రిజ్ తలుపు రబ్బరు సరిగ్గా అతుక్కోకపోతే, బయటి నుంచి వేడి గాలి లోపలికి వస్తుంది. దీని వల్ల ఫ్రిజ్ లోపల విపరీతంగా ఐస్ గడ్డకట్టి, ఆ తర్వాత కరిగి నీరు బయటికి కారుతుంది. రబ్బరు పాత బడిపోయినా లేదా మురికిగా ఉన్నా అది గాలిని లోపలికి పంపిస్తుంది. దాన్ని కొద్దిగా వేడి నీటితో తుడవండి లేదా రబ్బరు పాడైపోతే కొత్తది మార్పించుకోవడం మంచిది.
Also Read: టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!
కొన్ని సార్లు ఫ్రిజ్ కింద ఉండే కాళ్లు సమానంగా లేక పోవడం వల్ల కూడా నీరు ముందుకు కారుతుంది. ఫ్రిజ్ కొద్దిగా ముందుకి వంగి ఉన్నా ఈ సమస్య వస్తుంది. ఫ్రిజ్ కింద ఉండే అడ్జస్టబుల్ లెగ్స్‌ను తిప్పి ఫ్రిజ్‌ను కాస్త వెనక వైపుకు వంగేలా సెట్ చేయండి. అప్పుడు నీరు ఆటోమేటిక్‌గా డ్రైన్ హోల్ వైపు వెళుతుంది.
ఫ్రిజ్‌లో నీరు కారుతోందని టెన్షన్ పడాల్సిన పని లేదు. చిన్నపాటి టెక్నిక్స్ పాటిస్తే.. మీ ఇంట్లోనే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. దీని వల్ల టెక్నీషియన్ ఖర్చు మిగలడమే కాకుండా.. మీ ఫ్రిజ్ లైఫ్ కూడా పెరుగుతుంది.