BRS Survey: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై గులాబీ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆసర్వేల్లో ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ కు రాలేదని సమాచారం. ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఇంకా గులాబీ వైపు ప్రజలు మొగ్గుచూపలేదని సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. ఇంకా ప్రజల్లో ప్రభుత్వం చేస్తుందనే ఆశతోనే ఎదురుచూస్తున్నట్లు వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరెండున్నరేళ్లు గడిచినా, అమలు చేస్తున్న హామీలు, సంక్షేమ పథకాల తీరుపై బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేల్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ హామీల అమలు ,పాలనా శైలిపై ప్రజలు ఇంకా పూర్తి స్పష్టతకు రాలేదని, ప్రస్తుతం ‘వేచి చూసే ధోరణి’లోనే ఉన్నట్లు సర్వేల్లో స్పష్టమైనట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, గ్యారెంటీలు, డిక్లరేషన్లపై నిలదీస్తారని, తీరును ఎండగడతారని భావించిన ప్రజలకు నిరాశ మిగిల్చిన విషయం తెలిసిందే. తొలిరోజూ నల్లటీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చేప్రయత్నం చేయడం, పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం, మరుసటి రోజూ ఎమ్మెల్సీ బహిష్కరణపై పట్టుబట్టడం, మూడోరోజూ కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ నిరసనవ్యక్తం చేయడంతో స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ప్రశ్నిస్తుందనే తమను సస్పెండ్ చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని సమాచారం. అసెంబ్లీలో ఉంటేనే మైలేజ్ వచ్చేదని, తొందరపడ్డారనే ప్రచారం ఇప్పటికే విస్తృతంగా జరుగుతుంది. ఈ అసెంబ్లీ ఘటనపై ప్రజల ఒపినియన్ ను పార్టీ సేకరించినట్లు సమాచారం. అయితే ఊహించినంత స్పందన రాలేదని, మరింతగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపడితేనే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Also read: యూత్ కోసం నాయిస్ సరికొత్త ప్రయోగం! ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ చూశారా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు గడిచింది. తాగు, సాగునీరు ఇక్కట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో జాప్యం, పాలమూరురంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల పనులు కొనసాగుతూనే ఉండటం, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలజాప్యం, 22ఏతో పట్టాభూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడం, హైడ్రా ఇలా పలు అంశాలపైనా బీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్లు సమాచారం. అయితే ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇంకా ‘వేచి చూసే ధోరణి’స్పష్టమైనట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. కొన్ని పథకాలు అందుతున్నప్పటికీ, మరికొన్ని హామీల అమలుపై ఇంకా ఆశలు పెట్టుకున్నట్లు వెల్లడైనట్లు తెలిసింది.
ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు విమర్శలు ఎక్కుపెడుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో పార్టీ వైపు సానుకూలత రావడం లేదనే అభిప్రాయం సర్వేల్లో వ్యక్తమవుతోందని సమాచారం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆ వ్యతిరేకత పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ వైపు మళ్లడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలా ముందుకుపోవాలి, ప్రజా సమస్యలపై ఏ విధంగా పార్టీ పోరాడాలనే అంశంపై కేడర్‌లోనూ చర్చ జరుగుతోంది.
స్థానిక స్థాయిలో పార్టీ నేతల పనితీరు, ప్రజలతో మమేకమయ్యే తీరుపై తటస్థ వైఖరి కనిపిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న దూకుడు, ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో కొంత మంది నేతల్లో మందగించినట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గానికి చెందిన నేతలు దూకుడు పెంచడంతో వారికి ప్రజల్లో పాజిటీవ్ ధోరణి వ్యక్తమైనట్లు సమాచారం. నియోజకవర్గాల్లో కేడర్‌ను కాపాడుకోవడం, ప్రజలకు అందుబాటులో ఉండటంపై నేతలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన విధానాలపై గులాబీ కేడర్ మథనపడుతోంది. కేసీఆర్ నేతృత్వంలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఏ స్థాయిలో ఎండగట్టాలనేదానిపై సమగ్రమైన వ్యూహం అవసరమని పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించడం బీఆర్ఎస్‌కు తక్షణావసరంగా మారింది. అయితే ఎలా దూకుడు పెంచుతారు..ఏయే అంశాలతో ముందుకు సాగుతారనేది చూడాలి. ఇప్పుడు ప్రభుత్వంపై ప్రదర్శిస్తున్న దూకుడు సరిపోదని, నియోజకవర్గాల స్థాయిలోకి పార్టీ కార్యక్రమాలు వెళ్తేనే పార్టీకి ప్రజల్లో ఆదరణ వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also read: రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?.. సర్కార్‌ను నిలదీసిన బీజేపీ!