Samsung Galaxy Z Fold 8: ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోకి ఎన్ని రకాల ఫోల్డబుల్ ఫోన్లు వచ్చినా.. శాంసంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్‌గా వచ్చిన Galaxy Z Fold 8 డిజైన్, ఫీచర్లతో యూజర్లను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సన్నటి, తేలికపాటి మడత ఫోన్ వెనుక ఎంత కష్టం ఉందో తెలుసా? ఒక ఫోన్ తయారీ నుంచి కస్టమర్ల చేతికి వచ్చే వరకు శాంంసంగ్ ఎంత కఠినమైన పరీక్షలు చేస్తుందో ఇటీవల వెల్లడించింది. ఎనిమిది తరాల అనుభవంతో కంపెనీ ఈ ఫోన్‌ను అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దింది.
ఫోన్ బరువు తగ్గించడం అంటే కేవలం విడిభాగాలను చిన్నగా చేయడం కాదు. డిజైన్ మొత్తాన్ని మార్చాల్సి వచ్చింది. ఈ ఫోన్ బరువు కేవలం 201 గ్రాములు మాత్రమే. విప్పినప్పుడు 4.5 మిల్లీమీటర్లు, మడిచినప్పుడు 9.7 మిల్లీమీటర్ల మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ అద్భుతం సాధించడానికి సుమారు 270 రకాల విడిభాగాలను, 180 కంటే ఎక్కువ సహాయక విడిభాగాలను శాంసంగ్ ప్రత్యేకంగా రీడిజైన్ చేసింది.
ఫోన్ తేలికగా ఉంటూనే బలంగా ఉండేందుకు కంపెనీ సరికొత్త మెటీరియల్స్ వాడింది. ఇందులో ‘ఫ్లెక్స్ టైటానియం’ ఉపయోగించడం వల్ల డిజైన్ 10 శాతం పలచబడింది. దీనికి తోడు అడ్వాన్స్‌డ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ వాడటంతో ఫోన్ బరువు పెరగకుండా చాలా గట్టిగా తయారైంది. ఏ భాగానికి ఎలాంటి మెటీరియల్ అవసరమో అంతవరకు పర్ఫెక్ట్‌గా వాడి ఫోన్‌ను డిజైన్ చేశారు.
ఫోన్ సన్నగా మారినప్పటికీ.. బ్యాటరీ సైజు తగ్గకుండా శాంసంగ్ పక్కా ప్లాన్ చేసింది. ఇందులో మొదటిసారిగా సిలికాన్-కార్బన్ యానోడ్ టెక్నాలజీతో కూడిన బ్యాటరీని వాడారు. అంతేకాకుండా ఫోన్ ఎక్కువగా వాడినప్పుడు వేడెక్కకుండా చూడటానికి అడ్వాన్స్‌డ్ గ్రాఫైట్ సీలింగ్, ప్రత్యేకమైన ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల హెవీ యూసేజ్‌లో కూడా ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది.
ఫోన్ బయటకు రాకముందే కంపెనీ సుమారు 100 కంటే ఎక్కువ రకాల క్వాలిటీ పరీక్షలు నిర్వహిస్తుంది. పదే పదే మడతపెట్టడం, కింద పడేసి చూడటం, ధూళి తాకిడి, తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం లాంటి టెస్టులన్నీ చేస్తారు. ఏ ఒక్క భాగాన్ని విడిగా కాకుండా.. ఫోన్ మొత్తాన్ని ఒకే యూనిట్‌గా పెట్టి ఈ రఫ్ అండ్ టఫ్ టెస్టులు పూర్తి చేశాకే మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. శాంసంగ్ అనుసరించిన ఈ విధానం వల్ల Galaxy Z Fold 8 వాడుకలో చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాక.. సుదీర్ఘకాలం మన్నేలా నిలుస్తోంది.
Also Read: బ్యాటరీ పాడైందని కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మార్చుకోండిలా!