Indian Railways Sleeper Coach Rules: రైళ్లలో స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించేవారికి స్లీపింగ్ టైమ్ మీద ఉన్న రూల్స్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ప్రయాణికులు బెర్తులపై పడుకోవాలనే రైల్వే నిబంధనలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించేందుకు కోర్టు నిరాకరించింది. ప్రయాణికులందరికీ సమానంగా సౌకర్యం కల్పించడానికే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది.
రైల్వే నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ స్లీపర్ కోచ్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణికులు నిద్రపోవచ్చు. మిగిలిన సమయంలో బెర్తులపై పడుకోకుండా కూర్చోవడానికి అవకాశం కల్పించాలి. ముఖ్యంగా మిడిల్, అప్పర్ బెర్తులు కేటాయించిన ప్రయాణికులు పగటిపూట కూర్చోవడానికి ఇబ్బంది పడకుండా ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే, రీసెంట్ గా ఈ నిబంధనను సవాల్ చేస్తూ చెన్నైకి చెందిన బి. బాలసుబ్రమణియన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తాను తరచూ రైళ్లలో ప్రయాణిస్తానని, అనారోగ్యంతో ఉన్న తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో నిద్ర సమయంపై ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా తన భార్యకు బెర్తుపై విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించలేదన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణీలకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలని కోరినా తోటి ప్రయాణికులు సహకరించలేదని ఆయన వాదించారు. అందువల్ల ఈ నిబంధనలను పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరారు.
ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రయాణికులందరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ నిబంధనల ఉద్దేశమని వెల్లడించింది. డే టైమ్ లో మిడిల్, అప్పర్ బెర్తుల్లో ప్రయాణించేవారికి కూర్చునే అవకాశం ఉండాలని, అందుకే స్లీపింగ్ టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలిపింది. అనారోగ్యంతో ఉన్నవారు, వికలాంగులు, గర్భిణీల లాంటి వారికి అవసరమైన సందర్భాల్లో తోటి ప్రయాణికులు సహకరించాలని కూడా సూచించింది. ప్రయాణంలో ఎదురైన ఇబ్బందిని కారణంగా చూపి, ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నిబంధనలను రద్దు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో రైళ్లలో స్లీపర్ కోచ్‌ల నిద్ర సమయంపై ఉన్న ఆంక్షలను రద్దు చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తికి కోర్టు తోసిపుచ్చింది.
Read Also: ఈశాన్య భారతానికి బుల్లెట్ రైలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!