Criminal Detection Method: నేరస్తులను గుర్తించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పోలీసులు కొన్ని పద్దతులను పాటిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి ఫింగర్ ప్రింట్స్, DNA టెస్ట్ తో పాటు కాల్ డేటా. ఇప్పటి వరకు ఈ పద్దతుల ద్వారా నేరస్తులను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, నేరస్తులు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నారు. చాకచక్యంగా నేరాలు చేస్తున్నారు. ఎక్కడా క్లూస్ వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త విధానం ద్వారా నేరస్తులను గుర్తించే పద్దతిని కనిపెట్టారు శాస్త్రవేత్తలు.
సూక్ష్మక్రిముల విశ్లేషణతో నేరస్తుల గుర్తింపు
క్రైమ్ జరిగిన ప్రదేశంలోని సూక్ష్మక్రిములను విశ్లేషించడం ద్వారా నేరస్తులను ఇట్టే కనిపెట్టవచ్చు అంటున్నారు స్వీడన్ లోని లండ్ యూనివర్సిటీ పరిశోధకుడు ఎరాన్ ఎల్హైక్. అఫెన్స్ జరిగిన ప్రాంతంలోని బ్యాక్టీరియాను, నేరానికి ఉపయోగించిన ఆయుధాల మీద ఉన్నన బ్యాక్టీరియాను సరిపోల్చి నేరం చేసింది ఎవరో గుర్తించే అవకాశం ఉందంటున్నారు. ఇందుకోసం 18 దేశాలలో వివిధ వాతావరణాల నుంచి 4,135 సూక్ష్మజీవుల నమూనాలను తీసుకున్నట్లు తెలిపారు. AIని ఉపయోగించి ఆయుధాలు, వస్తువులపై మిగిలి ఉన్న బ్యాక్టీరియా ద్వారా నేరస్థులను కనిపెట్టవచ్చు అంటున్నారు.
AI Mgpsతో నేరస్తులను పట్టుకునే అవకాశం
సూక్ష్మక్రిముల ద్వారా నేరస్తులను గుర్తించేందుకు ప్రొఫెసర్ ఎరాన్ AI Mgpsని రూపొందించారు. మైక్రోబయోమ్ జియోగ్రాఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్(mGPS) అనే కొత్త AI సాధనం నేరం జరిగిన ప్రదేశంలోని బ్యాక్టీరియాను, నేరస్తులు వాడిన ఆయుధాల మీద ఉన్న బ్యాక్టీరియాను సరిపోల్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Mgps GPS సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సెల్ ఫోన్లు, చర్మం, ధూళి, నీరు లాంటి రోజువారీ వస్తువులపై కనిపించే సూక్ష్మజీవుల మూలాలను గుర్తిస్తుంది. నేరం జరిగిన ప్రదేశంలోని సూక్ష్మ క్రిములు, నేరానికి ఉపయోగించిన ఆయుధాల మీద ఉన్న సూక్ష్మక్రిములు, నేరానికి పాల్పడిన వారి మీద ఉన్న సూక్ష్మక్రిములు ఒకేలా ఉన్నాయో? లేదో? తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వీటిలో అన్నీ ఒకే రకమైన బ్యాక్టీరియాలు ఉన్నట్లైతే నేరం చేసింది వాళ్లే అని గుర్తించే అవకాశం ఉంటుంది. ఫోరెన్సిక్స్ పరీక్షల కోసం ఈ సాధనం ఎంతో ఉపయోగపడుతుందని ఎరాన్ వెల్లడించారు. ఇది DNA పరీక్షల కంటే కచ్చితత్వంతో కూడిన ఫలితాలను ఇస్తుందన్నారు. నేరం జరిగిన ప్రాంతంలో సూక్ష్మజీవులను చెరిపేయడం సాధ్యం కాదన్నారు. అదే నేరస్తులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
మరో 5 నుంచి 7 సంవత్సరాల్లో అందుబాటులోకి..
ప్రస్తుతం Mgps AI టూల్ టెస్టింగ్ దశలోనే ఉందని ప్రొఫెసర్ ఎరాన్ తెలిపారు. ప్రస్తుతం ఇందులో ఉన్న లోటు పాట్లను సరిచేస్తున్నామని చెప్పారు. mGPSని శక్తివంతం చేస్తున్నప్పటికీ ఇంకా మెరుగు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పద్దతి పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి సుమారు 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 6 ఖండాలు 18 దేశాలలోని 53 నగరాల నుంచి నమూనాలను సేకరించినట్లు ఆయన తెలిపారు. నేరస్తులు దేశాలు మారినప్పుడు ఈ పద్దతి ద్వారా కేవలం ఎయిర్ పోర్టు దాటకముందే గుర్తించాల్సి ఉంటుందన్నారు. ఎయిర్ పోర్టు దాటితే ఆయా దేశాల్లోని మైక్రో బయోమ్ ను పొందే అవకాశం ఉందన్నారు. ఈ టూల్ ను మరింతగా అభివృద్ధి చేసిన తర్వాత ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎరాన్ తెలిపారు.
Read Also: ఓ మై గాడ్.. ఎలుకలు కూడా డ్రైవింగ్ చేస్తాయా? ప్రయోగంలో అవి ఏం చేశాయంటే.?