Ceiling Fan: సాధారణంగా ఏ సీజన్‌లో అయినా చాలా ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి. మరి కొంతమందికి ఉండే అలవాటు ఏమిటంటే.. మనుషులు ఆ గదిలో ఉన్నా లేకపోయినా.. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే.. గది చల్లగా ఉంటుందని నమ్ముతుంటారు. కానీ, నిజంగానే రోజంతా ఫ్యాన్ ఆన్ చేసి ఉంచడం వల్ల గది చల్లబడుతుందా? దీని వెనుకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.
మనం అనుకునేదానికి భిన్నంగా.. సీలింగ్ ఫ్యాన్ గదిలోని గాలిని అస్సలు చల్లబరచదు. అది కేవలం మన చర్మంపై ఉండే చెమట త్వరగా ఆరిపోయేలా చేసి, మనకు చల్లదనపు అనుభూతిని మాత్రమే కలిగిస్తుంది. ఏసీ లాగా గదిలోని వేడిని, తేమను బయటకు పంపే శక్తి ఫ్యాన్‌కు లేదు. కాబట్టి.. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ వేసి ఉంచడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఫ్యాన్ చాలా తక్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది అనేది నిజమే అయినా.. అది రోజంతా అనవసరంగా తిరిగినప్పుడు నెల నెలా వచ్చే బిల్లుపై భారం పడుతుంది. అవసరం లేకపోయినా గంటల తరబడి ఫ్యాన్ నడపడం వల్ల ప్రతి నెల వేలల్లో కరెంట్ బిల్లు రావొచ్చు. ఈ అలవాటు డబ్బులను వృధా చేయడమే అవుతుంది.
Also Read: హోమ్ థియేటర్ సెటప్ చేస్తున్నారా? తొందరపడి ప్రొజెక్టర్ కొనే ముందు ఇది తెలుసుకోండి!
ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా నిజం. ఫ్యాన్ లోపల ఉండే ఎలక్ట్రిక్ మోటార్ నిరంతరం తిరగడం వల్ల కొంత వేడిని విడుదల చేస్తుంది. గది తలుపులు మూసి ఉండి, ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంటే.. ఆ మోటార్ నుంచి వచ్చే వేడి గాలి గదిలోనే ఉండిపోయి ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచుతుంది.
ఏ వస్తువుకైనా నిర్దిష్టమైన పని కాలం ఉంటుంది. రోజంతా ఫ్యాన్ తిరగడం వల్ల దాని బేరింగులపై ఒత్తిడి పడి, మోటార్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫ్యాన్ జీవితకాలం తగ్గిపోయి, అనుకున్నదానికంటే ముందే రిపేర్లకు రావడం లేదా కొత్తది కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఫ్యాన్ రెక్కలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే వాటిపై దుమ్ము పేరుకుపోతుంది. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ దుమ్ము గది అంతటా వ్యాపించి, అలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. పైగా రెక్కలపై దుమ్ము ఎక్కువగా ఉంటే మోటార్‌పై భారం పడి కరెంట్ కూడా ఎక్కువగా కాలుతుంది.
నిజానికి ఫ్యాన్ రెక్కలు వేసవిలో యాంటీ-క్లాక్‌వైజ్ (ఎడమ వైపుకు) తిరిగేలా చూసుకోవాలి. అప్పుడే గాలి కిందకు వస్తుంది. అలాగే మధ్యాహ్నం పూట ఇంట్లోకి ఎండ రాకుండా మందపాటి కర్టెన్లు వాడటం వల్ల గదిని సహజంగా చల్లగా ఉంచుకోవచ్చు. కాబట్టి.. మనుషులు గదిలో ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్ వేసుకోవాలి, బయటకు వెళ్లేటప్పుడు ఆపాలి అనేది మనం చేయాల్సిన మంచి పని.
Also Read: రూ.2.30 లక్షల Foldable iPhone.. లాంచ్ అయినా చేతికి రావడం కష్టమే, ఎందుకో తెలుసా?