దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు మిస్ యూజ్ అవుతున్నాయి. నకిలీ ఆధార్ కార్డులు, సిమ్ కార్డుల ద్వారా బ్యాంకు మోసాలతో పాటు పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ నేపథ్యంలో నకిలీ సిమ్ కార్డుల వ్యవహారంపై ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశంలో సైబర్ మోసాలకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు అమలుకాబోతున్నాయి. ఇకపై ఒక వ్యక్తి సిమ్ కార్డును ఉపయోగించి మోసానికి పాల్పడితే అతడిని బ్లాక్ లిస్టులో చేర్చేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది.
ఒక్కసారి బ్లాక్ లిస్టులో చేరితే అంతే సంగతులు!
ఫేక్ కాల్స్, ఫేక్ SMSల నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు టెలికాం డిపార్ట్ మెంట్ చర్యలకు దిగుతున్నది. ఎవరైనా ఒక వ్యక్తి నకిలీ సిమ్ ద్వారా జనాలను ట్రాప్ చేయడానికి ప్రయత్నించినా, అతడి సిమ్ ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే బ్లాక్ లిస్టులో చేర్చనున్నట్లు వెల్లడించింది. ఒకసారి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తే.. సదరు వ్యక్తి దేశంలో ఎక్కడి నుంచైనా సిమ్ కార్డు కొనుగోలు చేసే అవకాశం లేదు.
ఫేక్ కాల్స్, మెసేజ్ లపై కఠిన చర్యలు
సిమ్ కార్డు కొనుగోళ్లపైనా కఠిన ఆంక్షలు విధించనుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఐడీతో సిమ్ కార్డు కొనుగోలు చేయడం కూడా చట్ట విరుద్ధమేనని తేల్చి చెప్పింది. తప్పుడు ఆధారాలతో సిమ్ కార్డులు కొనుగోలు చేసే వారిని జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. అంతేకాదు, ఒక సిమ్ కార్డు నుంచి ఫేక్ మెసేజ్ పంపినా, ఫేక్ కాల్ చేసినా సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. తప్పుడు కార్యకలాపాలకు పాల్పడుతున్న సిమ్ ను గుర్తించినప్పుడు, ముందుగా ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉందో వారికి సమాచారం అందిస్తారు. వారం రోజుల్లో వివరణ అడుగుతారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనేది ఆలోచిస్తారు. ఒకవేళ ఆ సిమ్ కార్డును వేరేవాళ్లు మిస్ యూజ్ చేస్తున్నట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.
బ్లాక్ లిస్టులో ఎలా పెడతారు?
సిమ్ కార్డు కొత్త నిబంధనలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డేటా బేస్ రెడీ చేయబడుతుంది. అందులో సిమ్ కార్డు వాడే ప్రతి ఒక్కరి వివరాలు ఉంటాయి. ఎవరైనా నకిలీ సిమ్‌లను ఉపయోగిస్తున్నారు? లేదంటే ఇతరుల ఐడీతో ఏవైనా తప్పుడు కార్యకలాపాలు జరుగుతున్నాయా? అనే విషయాలు కూడా అందులో ఉంటాయి. టెలికాం డిపార్ట్ మెంట్, టెలికాం కంపెనీలు సంయుక్తంగా నకిలీ వినియోగదారులను ఐడెంటీ ఫై చేయనున్నాయి. నకిలీ సిమ్ కార్డులకు సంబంధించిన నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు, వాటిని అమలు తేదీని పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సిమ్ కార్డును మిస్ యూజ్ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం అని కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: ఈ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఆన్సర్ చేయొద్దు.. ఎత్తారో మీ ఖాతా మొత్తం ఖాళీ