Skoda Car : స్కోడా.. కార్లలో వీటికి ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ కార్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లో ఎన్నో భద్రతా లోపాలు ఉన్నాయని… ఇవి హ్యాకర్ల బారిన పడేట్టు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్ నడిపే వాళ్లను సైబర్ నేరస్తులు లోకేషన్ ట్రాక్ చేసే అవకాశం ఉందని, వ్యక్తిగత డేటాను సైతం యాక్సెస్ చేసే అవకాశం ఉందని, ఇక రిమోట్ గా కారు ఫంక్షన్స్ ను సైతం నియంత్రించే అవకాశం సైతం ఉందని చెప్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బ్లాక్ హాట్ యూరోప్‌లో ఆటోమోటివ్ సెక్యూరిటీలో ఎంతో అనుభవం కలిగిన సైబర్ సెక్యూరిటీ సంస్థ PCAautomotive… Skoda Superb III సెడాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రభావితం చేసే 12 కొత్త బలహీనతలను వెల్లడించింది. గత ఏడాది ఇదే కారులో తొమ్మిది లోపాలను కనుగొన్న తర్వాత మళ్లీ ఇప్పుడు భద్రతా లోపాలను వరుసగా రెండో ఏడాది సైతం వెల్లడించింది.
వోక్స్‌వ్యాగన్ యాజమాన్యంలోని స్కోడా, MIB3 ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను ఉపయోగిస్తుంది, ఇది రెండు బ్రాండ్‌లలోని అనేక ఇతర మోడళ్లలో కూడా కనిపిస్తుంది. ఇక ఈ అన్ని మోడల్స్ లో లోపాలు ఉన్నట్లు తెలుస్తుంది.
PCAutomotive నివేదిక ప్రకారం.. హ్యాకర్లు మాల్వేర్‌లను కారు సిస్టమ్‌లోకి ఇంజెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తారని వివరించారు. వీరు ఈ దాడిని రిమోట్‌గా నిర్వహించే అవకాశం ఉందని, హ్యాకర్‌లు బ్లూటూత్ ద్వారా వాహనం మీడియా యూనిట్‌ను కనెక్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఎటువంటి ప్రమాణీకరణ అవసరం లేకుండా 10 మీటర్ల దూరం నుండి దీన్ని యాక్సెస్ చేయవచ్చని తెలిపారు.
కారు లోపల ఉండే సిస్టమ్‌లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉందని.. కారు GPS కోఆర్డినేట్‌లను ట్రాక్ చేయగలరని తెలిపారు. కారులోని మైక్రోఫోన్‌ని ఉపయోగించి సంభాషణలను రికార్డ్ చేయగలరని.. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే స్క్రీన్‌షాట్‌లను తీయగలరని, కారు లోపల సౌండ్‌లను ప్లే చేయగలరని తెలిపి షాక్ ఇచ్చింది. .
ఇంకా కారు ఓనర్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌ను వాహనంతో కనెక్ట్ చేస్తే హ్యాకర్ కాంటాక్ట్ డేటాబేస్‌ను దొంగిలించవచ్చని తెలిపింది. స్టీరింగ్ వీల్ లేదా బ్రేక్‌ల వంటి సున్నితమైన అంశాలను సైతం నియంత్రణ చేయగలరని తెలిపింది.
ఇంకా వీటితో పాటు ఈ కార్లో ఆపరేటింగ్ సిస్టం తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ లో సైతం లోపాలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఈ నివేదిక. ఇప్పటికే ఈ కార్లను వాడుతున్న వాళ్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఒకవేళ కారు వేరే డివైసెస్ కు కనెక్ట్ అయి ఉంటే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తుంది.
ఇక ఏది ఏమైనా స్కోడా కార్లు ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేశాయనే చెప్పాలి. ఎంతో నమ్మకంగా ఇన్నేళ్లపాటు మార్కెట్లో నడిచిన ఈ కార్లలో తీవ్రమైన భద్రత లోపాలు కస్టమర్స్ ను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇకనైనా కారు డిజైనింగ్ లో స్కోడా కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
ALSO READ : ఈ Android స్పైవేర్ మీ ఫోన్ లో ఉందేమో చెక్ చేయండి! డేటాతో పాటు మీరూ ప్రమాదంలో పడినట్టే!