Smart Sunglasses| సోషల్ మీడియా, ఏఐ టెక్ దిగ్గజం అయితన మెటా ఇటీవల కంటి అద్దాలు ఉత్పత్తి చేసే ప్రముఖ రే–బాన్ కంపెనీతో కలిసి సంయుక్తంగా ఆవిష్కరించిన స్మార్ట్ గ్లాసెస్.. అడ్వాన్స్ టెక్నాలజీలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచాయి. ఫోన్ అవసరం లేకుండానే ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసే, వాయిస్ కమాండ్ తో పనిచేసే ఈ గ్లాసెస్ ఇప్పుడు మార్కెట్లో సెన్సేషన్‌గా మారాయి. స్టైలిష్ కళ్లజోళ్లకు పేరు గాంచిన రే–బాన్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటాతో కలిసి ఈ అత్యాధునిక గాడ్జెట్‌ను రూపొందించింది. ఇవి త్వరలో భారత్‌లోనూ లభించనున్నాయి. మెటాతో ఆపిల్, ఇతర కంపెనీలు కూడా ఇలాంటి గ్లాసెస్ ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయి.
ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రధానంగా వాయిస్ ఆధారంగా పనిచేస్తాయి. ఒక్క మాటతో ఫోటో తీయొచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు. అనేక భాషల అక్షరాలను మన భాషలోకి తక్షణమే అనువదించి చూపించగలవు. ఫోన్ లేకుండానే కాల్స్ మాట్లాడే వీలుంది. సంగీతం వినేందుకు హెడ్‌ఫోన్లు అవసరం లేదు. మెటా ఏఐ సాయంతో వాయిస్ అసిస్టెంట్‌తో సంభాషించవచ్చు. ఫోటోలు, వీడియోలు తీసేందుకు వాయిస్ కమాండ్లను వినగానే గ్లాసెస్ స్పందిస్తాయి. అలాగే లైవ్ స్ట్రీమింగ్ సౌలభ్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ అడ్వానస్ టెక్ గ్లాసెస్ ద్వారా.. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో.. నేరుగా లైవ్ ప్రసారం చేయవచ్చు.
ఇవి వినోదానికి మాత్రమే కాదు, కమ్యూనికేషన్‌కు కూడా పెద్ద సహాయక పరికరంగా మారతాయి. బిల్ట్–ఇన్ మైక్రోఫోన్లు, స్పీకర్లు గ్లాసెస్‌లోనే ఉండటంతో ఫోన్ కాల్స్ స్వీకరించవచ్చు, మాట్లాడవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో, వంట చేసే సమయంలో, నడుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా ఉంది. విదేశీ భాషలలో ఉన్న సైన్‌బోర్డ్స్‌ని గ్లాసెస్ తక్షణమే మనకు అర్థమయ్యే భాషలో చూపిస్తాయి.
ఇంకా.. ఏదైనా వస్తువులను, లేదా అంశాలను మనం పరిశీలిస్తే.. గ్లాసెస్ గుర్తించి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తాయి. దీన్ని ఆబ్జెక్ట్ రికగ్నిషన్ అంటారు. ఈ ఫీచర్ విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, పరిశోధకులకు ఎంతో ఉపయోగపడుతుంది. రోజువారీగా ఫోన్‌ను ఉపయోగించి చేసే పనులతో పాటు హ్యాండ్స్ ఫ్రీ పనులు కూడా ఈ గ్లాసెస్ భర్తీ చేయగలవు. యాప్‌లు, డిజిటల్ సేవలను వాయిస్ ఆధారంగా నియంత్రించవచ్చు. స్క్రీన్ అవసరం లేకుండానే మన కళ్ల ముందే అవసరమైన సమాచారం కనిపించడం కూడా వినూత్న అనుభవాన్ని ఇస్తుంది.
స్మార్ట్ గ్లాసెస్ ద్వారా మల్టీటాస్కింగ్ కూడా సాధ్యం అవుతుంది. ఉదాహరణకి, వంట చేస్తూనే కాల్ మాట్లాడవచ్చు, నడుస్తూనే వీడియో తీసుకోవచ్చు. ఇదంతా స్క్రీన్ వైపు చూడకుండా సహజంగా జరిగిపోతుంది. దీని వల్ల స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్ పట్టుకుని నిరంతరం స్క్రోల్ చేసే అవసరం కూడా ఉండదు.
Also Read: మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతోందా?.. పేలిపోతుంది జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి
స్మార్ట్ గ్లాసెస్‌తో సమస్యలు
అయితే, ఈ స్మార్ట్ గ్లాసెస్‌కు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ సమస్య. రోజంతా వాడేందుకు గ్లాసెస్‌ను తరచూ చార్జ్‌లో పెట్టాల్సి రావచ్చు. అంతేగాక, గోప్యత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఎదుటివారికి తెలియకుండానే వారి ఫోటోలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందున వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం తలెత్తుతుంది. ఇక మరో కీలక అంశం ధర. ఇవి అత్యాధునిక సాంకేతికతతో తయారైన గాడ్జెట్లు కావడంతో ధర సామాన్య ఫోన్ల కంటే చాలా ఎక్కువ.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ స్మార్ట్ గ్లాసెస్.. తక్షణమే ఫోన్లను పూర్తిగా భర్తీ చేయలేవు. ప్రస్తుతానికి ఇవి ఫోన్లకు సహాయక పరికరాలుగా ఉంటాయి. స్మార్ట్ వాచ్‌లు ఎలా ఉపయోగపడుతున్నాయో అలా. అయితే, ఫోన్ స్థానాన్ని పూర్తిగా దక్కించుకోవాలంటే వీటికి ఇంకా 10–20 ఏళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.