Smartphone Scams : ఐటీ హబ్ బెంగళూరులో తాజాగా కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఎన్నో విధాలుగా మోసాలు చేస్తున్న కేటుగాళ్లు స్మార్ట్ ఫోన్ తో స్కామ్ కు తెరతీశారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
దేశంలో ప్రతి చోటా సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి స్కామ్స్ బయట పడుతూనే వస్తున్నాయి. రోజురోజుకీ కొత్త తరహా మోసాలతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో కొత్త స్కామ్ బయటపడింది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపించిన దుండగులు దాంట్లో సిమ్ వేయగానే స్కామ్ చేశారు. దీంతో బ్యాంకు ఖాతాలో ఉన్న 2.28 కోట్లు ఒక్కసారిగా డెబిట్ అయిపోయాయి. దీంతో కంగుతిన్న వ్యక్తి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఈ తరహా సైబర్ మోసం ఎదురయింది. కొన్ని రోజుల క్రితం ఆ వ్యక్తికి ఓ ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లతో లాటరీ తీసామని.. ఇందులో భాగంగా మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని తెలిపారు. అడ్రస్ అడిగి తెలుసుకుని కొరియర్ లో స్మార్ట్ ఫోన్ పంపిస్తామని చెప్పారు. అది నిజమే అనుకున్న ఆ వ్యక్తి పూర్తి వివరాలు చెప్పడంతో అతని నంబరుకు కొత్త స్మార్ట్ ఫోన్ పార్సిల్ పంపించారు. అది చూడగానే నమ్మేసిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్ లో సిమ్ తీసి కొత్త ఫోన్ లో వేసి వాడటం మొదలుపెట్టాడు.
ALSO READ : మళ్లీ వస్తున్న ‘టిక్ టాక్’.. థాంక్స్ చెప్పిన యాప్ యాజమాన్యం!
ఆపై ఆ సిమ్ వేసిన కాసేపటికే మెసేజెస్, ఓటీపీలు వస్తున్నప్పటికీ కొత్త ఫోన్ కావడం వల్ల ఇలా వస్తున్నాయి అనుకున్న ఆ వ్యక్తి పూర్తి విషయం ఆరా తీసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ఫోన్ కంట్రోల్ లోకి తీసుకున్న స్కామర్స్ ఆ వ్యక్తి బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేశారు. పాస్వర్డ్ లతో పాటు ఓటీపీలను సైతం తెలివిగా పట్టేసి ఆయన ఖాతా నుంచి రూ.2.8 కోట్లు బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన తర్వాత ఆ వ్యక్తి ఈ విషయం గమనించాడు. వెంటనే పోలీసులు ఆశ్రయించి తనకు జరిగిన మోసానికి న్యాయం చేయాలని కోరాడు.
ఈ విషయంపై స్పందించిన సైబర్ పోలీసులు ఇలాంటి మోసాలు ప్రతీ చోటా జరుగుతున్నాయని.. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరించారు. ఇటువంటి లాటరీ బెనిఫిట్స్ కోసం ఆశపడుతూనే ప్రతి చోట అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాల్స్ లో ఎటువంటి ఓటీపీలు, పాస్వర్డ్స్ షేర్ చెయ్యెుద్దని తెలిపారు. వీడియోకాల్స్, నార్మల్ కాల్స్ తెలియని నెంబర్స్ నుంచి వస్తే లిఫ్ట్ చేయెుద్దని.. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్కామర్స్ ఎన్నో రకాలుగా మోసాలు చేస్తారని తెలిపారు.