New Ration Cards: అవాస్తవ ప్రచారాలు నమ్మవద్దు. అర్హత గల ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలతో లబ్ది ఖాయం. ఎవరూ ఆందోళన చెందవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అంతేకానీ బీఆర్ఎస్ పాలన మాదిరిగా తమకు మాయలు మంత్రాలు తెలియవని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియని, చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని పొన్నం తెలిపారు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగర పరిధిలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ , రేషనింగ్ అధికారి జిల్లా సరఫరా అధికారికి జోనల్ కమిషనర్లు, ఆయా ఉన్నతాధికారులతో సమీక్షించి మంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇంటి స్థలం ఉన్న వారితో పాటు ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయనివారు వార్డు సభలలో దరఖాస్తు చేసుకోవచ్చని, వార్డు సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు గతంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో వచ్చిన దరఖాస్తులను, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరికి గాను దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలన్నారు. అధికారులందరూ టీమ్ గా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు.
Also Read: TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూ మారుతోంది
జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబర్తి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, వెంకన్న, ఉపేందర్ రెడ్డి, రవికిరణ్, అడిషనల్ కమిషనర్ అలివేలు మంగ తాయారు, శివకుమార్ నాయుడు, సంబంధిత అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.