Starlink Price| ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీ భారతదేశంలో తన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు.. ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి స్టార్‌లింక్‌కు అవసరమైన లైసెన్స్ లభించింది. ఈ సేవ ద్వారా దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించడం లక్ష్యంగా ఉంది. ఈ సేవ ధరలు, ఖర్చుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
స్టార్‌లింక్ ఇంటర్నెట్ నెల వారీ ప్లాన్, సబ్‌స్క్రిప్షన్
స్టార్‌లింక్ భారత్‌లో అపరిమిత డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టనుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ నెలకు రూ. 3,000 నుండి ప్రారంభమవుతుంది. అదనంగా, వినియోగదారులు స్టార్‌లింక్ రిసీవర్ కిట్ కోసం ఒకేసారి రూ. 33,000 చెల్లించాలి. ఈ ధరలు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ అమలు చేసిన ప్లాన్‌లను పోలి ఉన్నాయని సీఎన్బీసీ తన నివేదికలో పేర్కొంది. ఈ సేవకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఏడాది చివర్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
స్టార్‌లింక్ గురించి
స్టార్‌లింక్ అనేది ఎలన్ మస్క్ చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ నిర్వహించే శాటిలైట్ ఇంటర్నెట్ సేవ. ఇది తక్కువ భూ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల ద్వారా వేగవంతమైన, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఈ సేవ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ సేవను ఉపయోగించడానికి వినియోగదారులు తమ ఇంటి లేదా కార్యాలయంలో ఒక రిసీవర్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలి.
భారత్‌లో అనుమతులు
స్టార్‌లింక్ భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అనుమతి పొందిన మూడవ సంస్థ. ఇంతకుముందు భారతీ ఎయిర్‌టెల్ యొక్క వన్‌వెబ్, రిలయన్స్ జియో కూడా ఇలాంటి అనుమతులను పొందాయి. అయితే, స్టార్‌లింక్‌కు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-స్పాస్) నుండి తుది అనుమతి ఇంకా రావాల్సి ఉంది. అలాగే, సేవలను ప్రారంభించడానికి ముందు స్టార్‌లింక్ స్పెక్ట్రమ్ కేటాయింపు, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేయాలి.
భారత్‌లో.. స్టార్‌లింక్ ఫ్లాన్ వివరాలు అంచనా ధరలు ఇలా ఉన్నాయి:
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు: రూ. 3,000 (అపరిమిత డేటా).
వన్ టైమ్ హార్డ్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ఫీజు: స్టార్‌లింక్ రిసీవర్ కిట్‌తో కలిపి రూ. 33,000
Also Read: గూగుల్ ఎఐలో లోపాలు.. తప్పుడు సలహాలు, ప్రమాదకర సూచనలు
ఈ ధరలు బంగ్లాదేశ్‌లో అమలులో ఉన్న స్టార్‌లింక్ ప్లాన్‌లను పోలి ఉన్నాయి. ఈ సేవ భారత్‌లో పూర్తిగా అమలులోకి వచ్చే ముందు మరిన్ని దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకురాగల సామర్థ్యం స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కు ఉంది. ఈ కొత్త టెక్నాలజీతో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనైనా నెట్‌వర్క్ సమస్య అనేది ఉండదు. ఇది డిజిటల్ కనెక్టివిటీని మరింత విస్తరించే అవకాశం ఉంది.