TikTok India: టిక్‌టాక్ పేరు వింటేనే చాలామందికి ఇప్పటికీ ఆ చిన్న చిన్న వీడియోల మోజు గుర్తుకొస్తుంది. ఐదేళ్ల క్రితం దేశ భద్రతా కారణాల వల్ల ప్రభుత్వం నిషేధం విధించాక, యాప్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. కానీ తాజాగా టిక్‌టాక్ మళ్లీ హైరింగ్ మొదలుపెట్టిందనే వార్తలు బయటకొచ్చి, సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి. గురుగ్రామ్ లోని టిక్ టాక్ ఇండియా ఆఫీస్‌లో కొత్త ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టడం చూసి, యాప్ తిరిగి వస్తుందా? అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ఇప్పుడు జరుగుతున్న హైరింగ్‌లో 2 కీలక పోస్టులు ఉన్నాయి. ఒకటి కాంటెంట్ మోడరేటర్. ఈ ఉద్యోగం ప్రధానంగా ప్లాట్‌ఫామ్‌లో హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించడం, యూజర్లకు సురక్షితమైన అనుభవం అందించడం కోసం ఉంటుంది. మరొకటి వెల్‌బీయింగ్ పార్ట్‌నర్‌షిప్, ఆపరేషన్స్ లీడ్ అనే మేనేజీరియల్ స్థాయి పోస్టు. దీని పని కంటెంట్ క్రియేటర్లతో, భాగస్వాములతో కలిసి సురక్షిత వాతావరణం కల్పించే ప్రోగ్రాములు రూపొందించి అమలు చేయడం.
ఈ 2 పోస్టులు LinkedIn వంటి ప్లాట్‌ఫామ్‌లలో బయటకు రాగానే, సోషల్ మీడియాలో టిక్‌టాక్ రీ-ఎంట్రీకి ఇది మొదటి అడుగేనా? అనే చర్చలు ఊపందుకున్నాయి. చాలామంది TikTok వీడియో క్రియేటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రింగ్లైట్‌లను దులిపేయాలి, మళ్లీ వీడియోలు షూట్ చేయాలి అంటూ జోకులు వేస్తున్నారు.
అయితే, ఇక్కడ ఒక స్పష్టత అవసరం. భారత ప్రభుత్వం ఇప్పటికీ TikTok యాప్‌పై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయలేదు. ఈ విషయాన్ని ఐటీ శాఖ ఇప్పటికే క్లియర్‌గా చెప్పింది. ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని అధికారికంగా ప్రకటించింది. అలాగే, Google Play Store, Apple App Store ప్లాట్‌ఫామ్‌లలో యాప్ ఇప్పటికీ డౌన్‌లోడ్‌కి అందుబాటులో లేదు.
కొద్ది రోజుల క్రితం టిక్‌టాక్ వెబ్‌సైట్ కొద్దిసేపు యాక్టివ్ అవ్వడంతో చాలామందికి యాప్ రీ-లాంచ్ అయిందేమో అనిపించింది. కానీ అది సాంకేతిక లోపం మాత్రమేనని కంపెనీ కూడా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రజల ప్రతిస్పందనలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఒక వర్గం ఈ టిక్‌టాక్ తిరిగి రాబోతుందనే గ్రీన్ సిగ్నల్ గా చూస్తుంటే, మరొక వర్గం మాత్రం.. ఇది కేవలం భవిష్యత్‌కు ప్రిపరేషన్ మాత్రమే, యాప్ లాంచ్ ఇంకా దూరంలోనే ఉందంటోంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. TikTok తన ఆపరేషన్లను మళ్లీ ప్రారంభించేందుకు ముందే అవసరమైన ప్లానింగ్ చేసుకుంటోంది. కానీ యాప్ అందుబాటులోకి రాబోతోందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
టిక్‌టాక్ తిరిగి రాక కోసం ఉన్న ఆసక్తికి కారణం కూడా వేరే లేదు. ఒకప్పుడు ఈ యాప్ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలుసు. చిన్న వీడియోల ఫార్మాట్‌ను మొదటగా పరిచయం చేసి, కోట్లాది మంది యూజర్లను ఆకట్టుకుంది. కంటెంట్ క్రియేటర్లకు టిక్‌టాక్ ఒక పెద్ద ప్లాట్‌ఫామ్‌గా మారి, అనేక మందికి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది.
బ్యాన్ తర్వాత Instagram Reels, YouTube Shorts, Moj, Josh వంటి యాప్‌లు మార్కెట్లోకి వచ్చి ఖాళీని నింపే ప్రయత్నం చేశాయి. కానీ టిక్‌టాక్ స్థాయిలో ప్రభావం చూపగలిగింది అనడం కష్టం. అందుకే టిక్‌టాక్ మళ్లీ వస్తుందనే ప్రతి వార్త కంటెంట్ క్రియేటర్లలో కొత్త ఊపిరి నింపుతోంది.
Also Read: Railway Development: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన స్టేషన్.. ఇప్పుడు రెడీ అవుతోంది.. ఎక్కడంటే?
అయితే నిజం ఒక్కటే.. ప్రస్తుత Hiring అంటే TikTok మళ్లీ అందుబాటులోకి వస్తుందనే అర్థం కాదు. ఇది కేవలం ఒక ప్రిపరేషన్ స్టెప్ మాత్రమే. భవిష్యత్తులో ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే ఆపరేషన్లు మొదలుపెట్టేలా, ఇప్పుడు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
టిక్‌టాక్ తిరిగి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నా, అది ఎప్పుడు జరుగుతుందనే విషయం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ప్రభుత్వం భద్రతా కారణాలపై యాప్‌ను నిషేధించినందున, ఆ అంశాల్లో ఎలాంటి మార్పులు జరిగితేనే అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది.
భవిష్యత్తులో టిక్‌టాక్ తిరిగి వస్తే, చిన్న వీడియోల మార్కెట్లో మళ్లీ పెద్ద ఎత్తున పోటీ మొదలవడం ఖాయం. ఇప్పటికే Instagram Reels, YouTube Shorts బలంగా ఉన్నా, TikTokకి ఉన్న క్రేజ్ మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు కంటెంట్ క్రియేటర్ల మధ్య పోటీ కూడా రగులుతుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం టిక్‌టాక్ యాప్ భారతదేశంలో ఇంకా బ్యాన్‌లోనే ఉంది. Gurugram కార్యాలయంలో జరుగుతున్న జాబ్ హియరింగ్ ను చూసి యాప్ తిరిగి వస్తోందని భావించకూడదు. ఇది కేవలం భవిష్యత్ ప్లానింగ్ మాత్రమే. ఒకవేళ రాబోయే నెలల్లో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, TikTok తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టడం ఖాయం.