Railway Development: రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు రైల్వే శాఖ వేగంగా పనులు ముందుకు తీసుకెళ్తోంది. పండుగ సీజన్‌లలో, రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ప్రయాణికుల క్రమబద్ధమైన నిర్వహణ కోసం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆధునిక సదుపాయాలతో కూడిన పర్మనెంట్ హోల్డింగ్ ఏరియా నిర్మాణం జరుగుతోంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూ ఢిల్లీ స్టేషన్‌ను సందర్శించి, జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో సమీక్ష జరిపి, పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, సజావుగా క్యూలు కట్టే విధానాలను దృష్టిలో పెట్టుకొని ఈ హోల్డింగ్ ఏరియా నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అజ్మీరీ గేట్ వైపు నిర్మాణంలో ఉన్న హోల్డింగ్ ఏరియా మూడు ప్రత్యేక విభాగాలుగా రూపొందించబడుతోంది. ఇందులో ప్రి టికెటింగ్ ఏరియా 1950 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, రష్ అవర్స్‌లో దాదాపు 2,700 మంది ప్రయాణికులు సులభంగా ఉండగలిగేలా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. టికెటింగ్ ఏరియా 2288 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండి, సుమారు 3,100 మంది ప్రయాణికులు సౌకర్యంగా టికెట్లు పొందేలా విస్తృత స్థలాన్ని అందిస్తోంది.
అలాగే పోస్ట్ టికెటింగ్ ఏరియా 1570 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండి, టికెట్లు పొందిన తర్వాత క్యూలైన్లలో నిలబడటానికి, భద్రతా తనిఖీలు చేయించుకోవడానికి, లగేజీ స్కానింగ్ పూర్తి చేసుకోవడానికి దాదాపు 1,350 మంది ప్రయాణికులకు సరిపడా స్థలాన్ని కల్పిస్తోంది.
ఈ హోల్డింగ్ ఏరియాలో ప్రయాణికుల సౌలభ్యం కోసం అనేక ఆధునిక సదుపాయాలను అందిస్తున్నారు. వీటిలో 22 టికెట్ కౌంటర్లు వేగంగా టికెట్లు ఇవ్వడానికి, 2 ఆధునిక టాయిలెట్ బ్లాక్స్ పరిశుభ్రత మరియు సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా ముఖ్యమైన సమాచారం అందించబడుతుంది. రైళ్ల టైమ్‌టేబుల్, ప్లాట్‌ఫాం వివరాలను చూపించేందుకు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు, భద్రతను పటిష్టం చేయడానికి AI ఆధారిత సర్వైలెన్స్ కెమెరాలు అమర్చబడ్డాయి.
Also Read: Train cancellations: తెలుగు రాష్ట్రాలలో పలు రైళ్ల దారి మళ్లింపు.. ఈ సమాచారం తప్పక తెలుసుకోండి!
భద్రతా తనిఖీల వేగం కోసం లగేజీ స్కానర్లు, ప్రయాణికుల మార్గదర్శకానికి స్పష్టమైన సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా, ఈ హోల్డింగ్ ఏరియాను స్టేషన్‌లోని మెట్రో కనెక్టివిటీతో సమన్వయం చేయడం ద్వారా ప్రయాణికులకు సులభమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నారు.
పనులలో ఎదురవుతున్న సవాళ్లు
ఈ ప్రాజెక్ట్‌లో అనేక సవాళ్లను అధిగమిస్తున్నారు. ఏటీఎం కౌంటర్లను మార్చడం, రెండు హై మాస్ట్ లైట్లను షిఫ్ట్ చేయడం, మొబైల్ టవర్లను తొలగించడం, ప్రీపెయిడ్ టాక్సీ స్టాండ్‌ను తరలించడం, ఢిల్లీ పోలీస్ క్యాబిన్‌ను మార్చడం వంటి కఠినమైన పనులను సజావుగా పూర్తి చేస్తున్నారు.
రైల్వే శాఖ ప్రకారం, ఈ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్‌లలో, అధిక రద్దీ సమయంలో క్యూలను సక్రమంగా నిర్వహించడమే కాకుండా, ప్రయాణికులు సులభంగా తమ రైలు వివరాలను తెలుసుకోవడం, భద్రతతో ప్రయాణం సాగించడం ఈ కొత్త హోల్డింగ్ ఏరియాతో సాధ్యమవుతుంది.
ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైల్వే శాఖ అధికారుల మాటల్లో, ఈ హోల్డింగ్ ఏరియా పూర్తిగా సిద్ధం అయిన తర్వాత, న్యూ ఢిల్లీ స్టేషన్‌లో రద్దీ సమయాల్లో ప్రయాణికులకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. క్యూలలో నిలబడటం, భద్రతా తనిఖీలు, టికెట్ బుకింగ్, లగేజీ స్కానింగ్ అన్నీ ఒకే చోట క్రమబద్ధంగా జరిగేలా సౌకర్యాలు కల్పించబడతాయి.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యం మాకు ప్రాధాన్యత. ఈ హోల్డింగ్ ఏరియా పూర్తయిన తర్వాత పండుగ సీజన్లలో లేదా ఇతర రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోతాయని తెలిపారు.
భవిష్యత్తు ప్రణాళికలు
రైల్వే అధికారులు ఈ ప్రాజెక్ట్‌ను మోడల్‌గా తీసుకుని, ఇతర ముఖ్య స్టేషన్లలో కూడా ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, సాంకేతిక సదుపాయాల కలయికతో కొత్త తరహా అనుభవాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో హోల్డింగ్ ఏరియా నిర్మాణం పూర్తి స్థాయిలో వేగవంతం అవుతోంది. ప్రయాణికుల కోసం ఆధునిక సదుపాయాలు, సురక్షితమైన వాతావరణం, సాంకేతిక మౌలిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రయాణికుల సేవలోకి రానుంది. పండుగ రద్దీకి ముందే ఈ హోల్డింగ్ ఏరియా ప్రారంభమైతే, రైల్వే ప్రయాణికులకు ఇది నిజమైన గుడ్ న్యూస్ కానుంది.