UPI Services: దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2025 నుంచి తిరిగి కేటాయించబడిన (reassigned phone numbers) లేదా ఇన్ యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లలో UPI సేవలు పనిచేయవు.
ఈ మార్పు ఎందుకు?
UPI లావాదేవీలు భద్రంగా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను మార్చినప్పుడు లేదా అది పనిచేయకుండా మారినప్పుడు, పాత నంబర్ UPIకి అనుసంధానంగా ఉండటంతో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఆ నంబర్ కొత్త వినియోగదారునికి కేటాయించబడితే, పాత యూజర్‌కి చెందిన UPI లావాదేవీలు కొత్త యూజర్‌కి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిరంతర అప్‌డేట్ అవసరం
బ్యాంకులు MNRL (Mobile Number Reallocation List) ఉపయోగించి కనీసం వారానికి ఒకసారి తమ మొబైల్ నంబర్ రికార్డులను అప్‌డేట్ చేయాలని NPCI ఆదేశించింది. ఇది అనవసరమైన భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
బ్యాంకులు ఎలా అమలు చేస్తాయి?
బ్యాంకులు, PSPలు ఇన్ యాక్టివ్ ఉన్న, తిరిగి కేటాయించబడిన లేదా UPI లింక్ లేని వినియోగించని నంబర్లను గుర్తించి తొలగిస్తాయి. ఆ క్రమంలో ప్రభావిత వినియోగదారులకు UPI సేవలు నిలిపివేయడానికి ముందు నోటిఫికేషన్ పంపిస్తారు. ఈ క్రమంలో బ్యాంకులు, PSPలు తమ రికార్డులను అప్‌డేట్ చేసుకుని, చెల్లుబాటు అయ్యే యాక్టివ్ మొబైల్ నంబర్లను మాత్రమే UPI సేవలకు అనుసంధానం చేస్తాయి.
Read Also: Air cooler Offer: రూ.2500కే 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్.. …
ఎవరు ప్రభావితమవుతారు?
చాలా కాలంగా కాల్స్, SMSలు లేదా బ్యాంకింగ్ సందేశాలు అందుకోని వినియోగదారులు
కొత్త వినియోగదారులు UPI సేవలను ఉపయోగించడానికి ముందు బ్యాంక్‌కి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది
మీ UPI సేవలను యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే?
-మీరు ఈ మార్పుల వల్ల ఇబ్బంది పడకూడదనుకుంటే, వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:
-మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేయండి
-కాల్ చేయడం లేదా SMS పంపడం ద్వారా మీ నంబర్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోవచ్చు
-మీ బ్యాంక్ నుంచి SMSలు, OTPలు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి
-లేదంటే మీ బ్యాంక్ బ్రాంచ్, నెట్ బ్యాంకింగ్, లేదా UPI యాప్ ద్వారా కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోండి
భద్రతను దృష్టిలో ఉంచుకుని
తప్పుగా కొత్త యూజర్‌కి UPI యాక్సెస్ వెళ్లకుండా ఉండేందుకు బ్యాంకులు ఈ చర్య తీసుకుంటున్నాయి. NPCI తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా UPI లావాదేవీలు మరింత సురక్షితంగా కొనసాగుతాయి. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు తమ రికార్డులను MNRL ద్వారా నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మీరు కూడా మీ UPI సేవలు ఇబ్బంది లేకుండా కొనసాగించాలనుకుంటే, మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి మరి.