Whatsapp Instagram Facebook : మెటా ఆధ్వర్యంలో పనిచేసున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సేవల్లో అంతరాయంపై ఎక్స్ వేదికగా మెటా స్పందించింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తో పాటు మెటా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సోషల్ ఫ్లాట్ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవల్లో ఆటంకం ఏర్పడటంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము పంపిన మెసెజ్‌లు వేరే వాళ్లకి వెళ్లటంలేదని, ఈ యాప్స్ ను లాగిన్ చేయలేకపోతున్నామని, పోస్టులు అప్లోడ్ చేయటంలో సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పలువురు యూజర్‌లు పేర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ తెలిపింది.
ఇక ఇప్పటికే సుమారు 50వేల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్లు, 23వేల మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ తెలిపింది. మరోవైపు ఈ సేవల్లో అంతరాయంతో ‘ఎక్స్’ వేదికగా పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మీమ్స్ సైతం పోస్ట్ చేస్తున్నారు. ఇక తమ సేవల్లో అంతరాయం నెలకొనడంతో ‘ఎక్స్’ వేదికగా మెటా స్పందించింది. సాంకేతిక సమస్యతో యాప్స్‌ను పలువురు ఉపయోగించుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చింది. ఈ విషయం ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. తమ సేవల్లో అంతరాయం నెలకొన్నందుకు క్షమాపణలు కోరుతున్నట్లు మెటా పేర్కొంది.
అయితే ఈ మధ్యకాలంలో మెటా సేవల్లో ఎప్పటికప్పుడు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సైతం సేవలో నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్స్ పెద్ద ఎత్తున ఎక్స్ వేదికగా నిరసన తెలిపారు. ఇక వాట్సాప్ లో సైతం సమస్యలు ఎదురవుతుండగా.. ఇప్పుడు తాజాగా ఈ మూడు యాప్స్ లో ఒకేసారి సేవల్లో అంతరాయం ఏర్పడింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్న చాట్ జీపీటీ సేవల్లో సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే లక్షలాది మంది ఈ చాట్ జీపీటీని ఉపయోగిస్తుండగా సేవల్లో అంతరాయంతో ఎందరో యూజర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై యూజర్లకు ‘ఎక్స్’ వేదికగా స్పందించింది ఓపెన్ ఏఐ. క్షమాపణలు చెబుతూ సమస్య గుర్తించామని తెలిపింది. పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని.. త్వరలోనే చాట్‌జీపీటీ గ్లోబల్ ఔటేజ్‌పై అప్‌డేట్ సైతం ఇస్తామని చెప్పుకొచ్చింది. ఇక వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్టాతో పాటు అదే సమయంలో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇక ఈ చాట్‌జీపీటీతో సేవలతో పాటు అదే సంస్థకు చెందిన ఏపీఐ, సోరా సేవల్లో సైతం ఈ సమస్య తలెత్తింది.
ఇక ఈ సేవలు ఆగిపోవడానికి ఎన్నో కారణాలు సైతం ఉన్నట్టు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సర్వర్ సమస్యలతో పాటు వాట్సాప్ లో అధిక డేటాను యాక్సెస్ చేయలేకపోవడం సైతం సమస్యగా మారుతుందని తెలుపుతున్నాయి. కొన్నిసార్లు ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు మరిన్ని విషయాలు యాక్సెస్ కు అడ్డుగా నిలుస్తాయని చెప్పుకొస్తున్నాయి. యాప్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు సెక్యూరిటీ ఫీచర్స్ ను అందుబాటులో ఉంచుకోవడంతో ఈ సమస్యను సగం పరిష్కరించవచ్చాని తెలుపుతున్నాయి
ALSO READ : ఫోల్డబుల్ ఐఫోన్స్ నిజంగా రాబోతున్నాయా..!