WhatsApp Scam: అమాయకులను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొద్ద పద్దతిలో ప్రజల అకౌంట్లను ఖాళీ చేసే కుట్రలకు తెరలేపుతున్నారు. తాజాగా కేటుగాళ్లు వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేశారు. వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ స్కామ్ పేరుతో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ స్కామ్ గురించి వన్ కార్డ్ కస్టమర్లను హెచ్చరించింది. ఈ మోసం ద్వారా పర్సనల్ వివరాలు సహా బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని క్రెడిట్ కార్డ్ కంపెనీ వన్ కార్డ్ హెచ్చరించింది.
ఇంతకీ ఏంటి స్క్రీన్ మిర్రరింగ్ స్కామ్?
ఇదో రకమైన సైబర్ మోసం. ఈ స్కామ్ లో ముందుగా కేటుగాళ్లు వాట్సాప్ యూజర్లను నమ్మించేందుకు బ్యాంకు ఉద్యోగులుగా నమ్మిస్తారు. వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని చెప్తారు. వాటిని సాల్వ్ చేయడానికి వాట్సాప్ ద్వారా స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలని సూచిస్తారు. వారి మాటలు నమ్మి వాట్సాప్ వినియోగదారులు స్క్రీన్ మిర్రరింగ్ ఆన్ చేశారో అంతే సంగతులు. ఫోన్ లోని పర్సనల్ విషయాలతో పాటు బ్యాంక్ అకౌంట్స్ వివరాలు పాస్ వర్డ్స్, ఓటీపీలు, పర్సనల్ మెసేజ్ లు సహా ఫోన్ లోని సమాచారం అంతా సైబర్ క్రైమ్ నేరస్తుల చేతికి చిక్కుతుంది. స్క్రీన్ షేరింగ్ ప్రారంభమైన వెంటనే పాస్ వర్డ్స్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు సహా అన్ని వివరాలను యాక్సెస్ చేసుఉంటాడు.
అదే సమయంలో వాట్సాప్ యూజర్ ఫోన్ లోకి కీలాగర్ ఇన్ స్టాల్ చేస్తారు. దీని ద్వారా మీరు ఫోన్ లో టైప్ చేసే ప్రతి విషయాన్ని గమనిస్తారు. ఈ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అయిన తర్వాత మీ బ్యాంకింగ్ సహా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిసాయంతో వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తారు. అంతేకాదు, వారి పర్సనల్ డేటాను యాక్సెస్ చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుంది.
Read Also: ఆపిల్ కంపెనీ బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ 17.5 కోట్లు బహుమతి!
వాట్సాప్ నయా మోసం నుంచి ఎలా కాపాడుకోవాలి?
వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సైబర్ నిపుణులు. తెలియని నెంబర్స్ లేదంటే అనుమానాస్పద నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేయకపోవడం మంచిదంటున్నారు. ఒకవేళ స్క్రీన్ షేరింగ్ సమయంలో బ్యాంకింగ్ కు సంబంధించిన ఎలాంటి యాక్టివిటీ చేయకూడదంటున్నారు. అంతేకాదు, అనుమానాస్పద, తెలియని లింక్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సైబర్ పోలీసులను లేదంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930నెంబర్ కు కాల్ చేయాలంటున్నారు.
Read Also: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నిపుణులు