WhatsApp Spam Calls: ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండి.. వాట్సప్ వాడని వారంటూ ఎవరైనా ఉన్నారా? పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక అవసరానికి ఇది ఉండాల్సిందే. అయితే, వాట్సప్ వాడకం ఎంత పెరిగిందో.. తెలియని నెంబర్ల నుండి వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గోల కూడా అంతే ఎక్కువైంది. ఆఫీస్ పనిలో ఉన్నప్పుడో లేదంటే హాయిగా నిద్రపోతున్నప్పుడో ఇలాంటి పిచ్చి కాల్స్ వస్తే ఎవరికైనా చిరాకు రావడం సహజం. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వాట్సప్ ఒక సూపర్ ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటో చూసేద్దాం రండి..
మన ఫోన్ కాంటాక్ట్స్‌లో లేని కొత్త నెంబర్ల నుండి కాల్స్ వచ్చినప్పుడు మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి వాట్సప్‌లో ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని గనుక మనం ఆన్ చేసి పెట్టుకుంటే.. మన మొబైల్‌లో సేవ్ చేసుకోని నెంబర్ల నుండి కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ అస్సలు రింగ్ అవ్వదు. ఆ కాల్స్ సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాయి. దీంతో మనం ప్రశాంతంగా ఉండొచ్చు.
Also Read: మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న శాంసంగ్ కొత్త 5G మొబైల్స్!
ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నంత మాత్రాన అవతలి వాళ్లను మనం పూర్తిగా బ్లాక్ చేసినట్టు కాదు. వాళ్లు చేసే కాల్స్ మనకు డిస్టర్బెన్స్ కలిగించకుండా కేవలం సైలెంట్ అవుతాయి అంతే. ఆ తర్వాత మనం ఫ్రీగా ఉన్నప్పుడు నిమ్మళంగా వాట్సప్ ఓపెన్ చేసి.. కాల్ హిస్టరీలోనో లేదా నోటిఫికేషన్స్‌లోనో ఎవరెవరు ఫోన్ చేశారో చూసుకోవచ్చు. ఒకవేళ అది మనకు తెలిసిన వాళ్ల నెంబరే అనుకుంటే.. తిరిగి వాళ్లకు కాల్ బ్యాక్ చేయొచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా, ఐఫోన్ వాడుతున్నా.. చాలా అంటే చాలా ఈజీగా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవచ్చు. మొదట మీ మొబైల్‌లో వాట్సప్ ఓపెన్ చేసి Settings లోకి వెళ్లండి. అక్కడ Privacy అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే Calls అని ఉంటుంది. దానిపై నొక్కి Silence Unknown Callers అనే బటన్‌ను ఆన్ (గ్రీన్ కలర్) చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా నిమిషంలో అయిపోయే పని.
ఈ ఫీచర్ వల్ల మనకు చాలా వరకు తిప్పలు తప్పుతాయి. కానీ దీనిలో ఒక చిన్న మినహాయింపు ఉంది. మీరు గనుక గతంలో ఎప్పుడైనా ఏదైనా అవసరం కోసం.. అంటే డెలివరీ బాయ్స్‌కో, క్యాబ్ డ్రైవర్లకో నెంబర్ సేవ్ చేసుకోకుండా కేవలం వాట్సప్‌లో మెసేజ్ పెట్టడమో లేదా కాల్ చేయడమో చేసి ఉంటే.. వాట్సప్ దాన్ని కొత్త నెంబర్‌గా అనుకోదు. కాబట్టి నెక్ట్స్ టైమ్ వాళ్లు ఫోన్ చేస్తే ఎప్పటిలాగే రింగ్ అవుతుంది. ఏదేమైనా ఆన్‌లైన్ మోసాలు, స్పామ్ కాల్స్ విపరీతంగా పెరుగుతున్న నేటి రోజుల్లో.. ఈ చిన్న సెట్టింగ్ చేసుకోవడం మన భద్రతకు ఎంతో మంచిది.
Also Read: ఐకూ దెబ్బ మామూలుగా లేదుగా.. 8000mAh బ్యాటరీతో 15T మోడల్ వచ్చేస్తోంది.. ఆ రోజే లాంచ్!