WhatsApp View Once Text: వాట్సప్‌లో మన పర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకునేటప్పుడు ప్రైవసీ గురించి ఆందోళన ఉండటం సహజం. ముఖ్యంగా మనం పంపిన మెసేజ్‌లను అవతలి వ్యక్తులు స్క్రీన్‌షాట్ తీయడం, కాపీ చేయడం లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేయడం వంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘వ్యూ వన్స్’ (View Once) ఆప్షన్‌ను ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా విస్తరించనుంది.
అంటే.. మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి ఒక్కసారి మాత్రమే చదవగలరు. ఆ తర్వాత మళ్లీ చూడటం కుదరదు. అంతేకాదు.. స్క్రీన్‌షాట్, కాపీ, ఫార్వర్డ్ చేయకుండా కూడా పరిమితులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్‌ను మెటా పరీక్షిస్తోంది. త్వరలోనే మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రముఖ వాట్సప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo అందించిన సమాచారం ప్రకారం.. ఐఓఎస్ (iOS) వాట్సప్ బీటా వెర్షన్ 26.45.10.73 వాడుతున్న కొంతమంది యూజర్లకు ఈ కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. యాపిల్ టెస్ట్‌ఫ్లైట్ (TestFlight) ప్రోగ్రామ్ ద్వారా దీనిని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది కాబట్టి.. సాధారణ యూజర్లందరికీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ పనిచేసే విధానం చాలా సింపుల్. మనం ఎవరికైనా పర్సనల్ చాట్‌లో లేదా గ్రూప్‌లో సీక్రెట్ మెసేజ్ పంపాలనుకున్నప్పుడు, చాట్ బాక్స్‌లో టెక్స్ట్ టైప్ చేయాలి. ఆ తర్వాత సెండ్ (Send) బటన్‌ను మామూలుగా నొక్కకుండా.. కాసేపు ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు మెసేజ్ షెడ్యూల్ చేయడానికి లేదా ‘వ్యూ-వన్స్’ మోడ్‌లో పంపడానికి ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో వ్యూ-వన్స్ ఎంచుకుంటే మెసేజ్ వెంటనే వెళ్లిపోతుంది. మీ అకౌంట్‌కు ఈ ఫీచర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పదేపదే చెక్ చేయాల్సిన పనిలేదు. ఫీచర్ యాక్టివేట్ అవ్వగానే చాట్ బార్ పైన వాట్సప్ స్వయంగా ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది.
Also Read: ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన మైక్రోమ్యాక్స్, కార్బన్ రీ-ఎంట్రీ.. చైనా బ్రాండ్ల ఖాళీని భర్తీ చేయగలవా?
అవతలి వ్యక్తి ఈ వ్యూ-వన్స్ మెసేజ్ బబుల్‌పై క్లిక్ చేసినప్పుడు, అది ఒక ప్రత్యేకమైన విండోలో ఓపెన్ అవుతుంది. ఆ మెసేజ్‌కు ఉన్న ప్రైవసీ రూల్స్ గురించి అక్కడ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్‌లో ఈ మెసేజ్ ఓపెన్ చేసి ఉన్నంతసేపు స్క్రీన్‌షాట్ తీయడం కానీ, స్క్రీన్ రికార్డింగ్ చేయడం కానీ అస్సలు కుదరదు. అంతేకాకుండా.. ఈ టెక్స్ట్‌ను కాపీ చేయడం, వేరే వాళ్లకు ఫార్వర్డ్ చేయడం లేదా సేవ్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు.
రిసీవర్ ఆ మెసేజ్ చదివిన తర్వాత ఆ విండోను క్లోజ్ చేస్తే చాలు, ఆ టెక్స్ట్ శాశ్వతంగా మాయమైపోతుంది. మళ్లీ దాన్ని ఓపెన్ చేసి చూసే అవకాశమే ఉండదు. ప్రస్తుతం కొద్దిమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, త్వరలోనే పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే వాట్సప్ చాటింగ్ మరింత సురక్షితంగా మారడం ఖాయం.
Also Read: చలికాలంలో బట్టలు ఉతకడం కష్టంగా ఉందా? తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ 7KG వాషింగ్ మెషీన్లు ఇవే!