వాట్సప్, టెలిగ్రామ్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్.. ఒకరితో ఒకరు టచ్ లో ఉండటానికి, సందేశాలు పంపించుకోడానికి టెక్స్ట్ మెసేజ్ ల తోపాటు వాయిస్ మెసేజ్ లు, ఆడియోలు, వీడియోలు, స్టిక్కర్లు సెండ్ చేసుకోడానికి అందుబాటులో ఉన్న కొన్ని యాప్స్ ఇవి. ఇలాంటి యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నా వాటిని పూర్తిగా నమ్మలేం. ఇవి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అని చెబుతున్నా.. సర్వర్ లో మన డేటా అంతా స్టోర్ అయిపోతుంది. వ్యక్తిగత వాట్సప్ చాట్ లను కూడా కనిపెట్టే యాప్ లు కూడా చాలానే ఉన్నాయి. మరి ఎవరికీ తెలియకుండా ఇద్దరు వ్యక్తులు మొబైల్ లో చాట్ చేసుకోవాలంటే ఎలా..? దానికోసమే బిట్ చాట్ ని కనిపెట్టారు. ఆధునిక మొబైల్ యాప్స్ లో ఇది ఓ సంచలనంగా మారుతోంది.
నెట్ వర్క్ లేకపోయినా..
మీ మొబైల్ లో నెట్ వర్క్ లేకపోయినా ఇది పనిచేస్తుంది. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. గతంలో మనం ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కు డేటా ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే బ్లూటూత్ ని వాడేవాళ్లం గుర్తుందా. అదే బ్లూటూత్ తో ఈ బిట్ చాట్ పనిచేస్తుంది. బ్లూటూత్ తో పనిచేస్తుందంటే దీని పరిధి తక్కువ అని మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. 300 మీటర్ల పరిధిలో బ్లూటూత్ పనిచేసే ఏరియాలో మాత్రమే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కు ఈ బిట్ చాట్ ద్వారా మనం టెక్స్ట్ మెసేజ్ లను పంపించుకోగలం.
అడ్వాంటేజెస్..
– ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది
– నెట్ వర్క్ సమస్యలున్నా కూడా మెసేజ్ లు వెళ్తాయి
– మూడో వ్యక్తికి డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదు
– యాప్ అవసరం లేదు, ఈ మెయిల్ అవసరం లేదు, ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదు
– అనవసర అడ్వర్టైజ్మెంట్లు, ఇతరత్రా కమర్షియల్ యాడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు
పరిమితులు
– 300 మీటర్ల పరిధిలోనే మెసేజ్ లు వెళ్తాయి
– వీడియోలు, ఫొటోలు.. గ్రాఫిక్స్ ఇలాంటి వాటికి అవకాశం తక్కువ
– ఆధునిక కాలంలో ఇలాంటి పాత పద్ధతిని ఫాలో అవడం కష్టం
బిట్ చాట్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి, కానీ దానికి కొన్ని పరిమితులున్నాయి. అయినా కూడా వ్యక్తిగత గోప్యత పరంగా ఇది చాలా ఉపయోగం అంటున్నారు. ముఖ్యంగా ఏదైనా విపత్తులు జరిగినప్పుడు నెట్ వర్క్ అందుబాటులో లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా.. దగ్గర్లో ఉన్న వ్యక్తుల్ని బిట్ చాట్ ద్వారా కాంటాక్ట్ కావొచ్చు. గుంపులు గుంపులుగా జనం పోగైనప్పుడు నెట్ వర్క్ సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు కూడా బిట్ చాట్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
ట్విట్టర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డౌర్సే ఈ బిట్ చాట్ ని కనిపెట్టారు. ప్రస్తుతం ఈయన బ్లాక్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. అయితే ఇది ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రయోగ దశలో ఉంది. టెస్టింగ్ సమయంలో 10వేలమంది దీన్ని ఉపయోగించారు. చాలామంది దీనిపై ఆసక్తి చూపించారు. త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.