Youtube Hype Feature| వీడియో స్ట్రేమింగ్ దిగ్గజం యుట్యూబ్ కొత్తగా ‘హైప్’ అనే ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ప్రేక్షకులు తమ ఇష్టమైన చిన్న క్రియేటర్ల వీడియోలను ఎక్కువ మందికి చేరేలా చేయవచ్చు. 2024లో గూగుల్ యొక్క ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ ఈవెంట్‌లో ఈ ఫీచర్‌ను మొదట ప్రకటించారు. ఈ ఫీచర్ 5 లక్షల కంటే తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న క్రియేటర్ల వీడియోల కింద ‘లైక్’ బటన్ పక్కన ఒక కొత్త ‘హైప్’ బటన్ లో యాడ్ చేయబడింది.
హైప్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
యూట్యూబ్‌లో వీక్షకులు వారానికి మూడు వీడియోలను ‘హైప్’ చేయవచ్చు, అయితే ఈ వీడియోలు 5 లక్షల కంటే తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లవి మాత్రమే. హైప్ చేయబడిన ప్రతి వీడియోకు పాయింట్లు లభిస్తాయి, ఇలా చేయడంతో ‘ఎక్స్‌ప్లోర్’ మెనూలో ఉన్న ర్యాంక్ లీడర్‌బోర్డ్‌లో చోటు సంపాదించే అవకాశం ఇస్తాయి. ఈ లీడర్‌బోర్డ్ అందరికీ ఒకే విధంగా కనిపిస్తుంది. అంటే ఒకే దేశంలోని వీక్షకులందరూ ఒకే రకమైన హైప్ చేయబడిన వీడియోల జాబితాను చూస్తారు. ఇది కొత్త కంటెంట్‌ను కనుగొనడానికి సహాయపడుతుంది.
చిన్న క్రియేటర్లకు ఎక్కువ అవకాశం ఇవ్వడానికి, సబ్‌స్క్రైబర్ల సంఖ్య తక్కువగా ఉన్న క్రియేటర్లకు ఎక్కువ బోనస్ పాయింట్లు లభిస్తాయి. హైప్ చేయబడిన వీడియోలకు ‘హైప్డ్’ బ్యాడ్జ్ కనిపిస్తుంది. వీక్షకులు తమ హోమ్ ఫీడ్‌లో ‘హైప్డ్’ వీడియోలను మాత్రమే చూసేలా ఫిల్టర్ చేయవచ్చు. అభిమానులు హైప్ చేసిన వీడియో.. లీడర్‌బోర్డ్‌కు దగ్గరగా ఉన్నప్పుడు యూట్యూబ్ నోటిఫికేషన్ పంపుతుంది. నెలవారీగా ఎక్కువగా హైప్ చేసిన అభిమానులకు ‘హైప్ స్టార్’ బ్యాడ్జ్ లభిస్తుంది, ఇది వారి కమ్యూనిటీలోని సహకారాన్ని హైలైట్ చేస్తుంది.
వీక్షకులకు మెరుగైన అనుభవం
హైప్ ఫీచర్‌ను ఉపయోగించడం సులభం, ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి వీడియో కింద ఒక హైప్ బటన్ ఉంటుంది. దీంతో వీక్షకులు తమ మద్దతును త్వరగా చూపించవచ్చు. హైప్ చేయబడిన వీడియోలు ప్లాట్‌ఫామ్ అంతటా ‘హైప్డ్’ బ్యాడ్జ్‌తో కనిపిస్తాయి. వీక్షకులు తమ హోమ్ ఫీడ్‌ను హైప్ చేయబడిన కంటెంట్‌ను మాత్రమే చూసేలా సెట్ చేయవచ్చు. అభిమానులు హైప్ చేసిన వీడియో లీడర్‌బోర్డ్‌కు చేరువవుతున్నప్పుడు నోటిఫికేషన్‌లు అందుతాయి.
క్రియేటర్లకు కొత్త అవకాశాలు
క్రియేటర్లు యూట్యూబ్ స్టూడియోలోని ‘హైప్ కార్డ్’ ద్వారా తమ వీడియోలకు ఎన్ని హైప్‌లు, హైప్ పాయింట్లు వచ్చాయో చూడవచ్చు. వారి వీడియోలు వారానికి లభించే ఎనలిటిక్స్‌లో ఒక రీక్యాప్ కూడా ఉంటుంది. ఇది వారి కంటెంట్ ఏ విధంగా అభిమానులతో కనెక్ట్ అవుతోందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
రాబోయే అప్‌డేట్‌లు
యూట్యూబ్ గేమింగ్, స్టైల్ వంటి నిర్దిష్ట కేటగిరీల కోసం హైప్ లీడర్‌బోర్డ్‌లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అభిమానులు తాము హైప్ చేసిన వీడియోలను షేర్ చేసే ఫీచర్ కూడా రానుంది, ఇది క్రియేటర్లకు మరింత ఎక్స్‌పోజర్ ఇస్తుంది. అదనంగా, యూట్యూబ్ అభిమానులు ఎక్కువ హైప్‌లను కొనుగోలు చేసే అవకాశాన్ని అందించనుంది. ఇది క్రియేటర్ల వీడియోలను మరింత బూస్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఈ పెయిడ్ హైప్ ఫీచర్ ప్రస్తుతం బ్రెజిల్, టర్కీలో పరీక్షిస్తున్నారు.
ఈ హైప్ ఫీచర్.. చిన్న క్రియేటర్లకు వైరల్ అయ్యే అవకాశాన్ని ఇస్తూ.. అభిమానులు వారి ఇష్టమైన కంటెంట్‌ను ప్రమోట్ చేయడంలో భాగం కావచ్చు.
Also Read: యుట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి