Ajay Ratra appointed as member of BCCI men’s selection committee: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో దేశంలోని అన్ని జోన్లకు చెందిన వారికి స్థానం కల్పిస్తారు. ఎందుకంటే వారు తమ ప్రాంత క్రీడాకారులకి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తారు. అలాగే వారి జోన్స్ పరిధిలో మెరికల్లాంటి క్రీడాకారుల వివరాలను వారు తెలుసుకుంటారు. వారు జాతీయ జట్టులో ఎంపికయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
అందుకనే సెలక్షన్ కమిటీలో దేశంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే అన్ని వేళలా సాధ్యం కాదు. సీజన్ ప్రకారం రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తుంటారు.
అయితే ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ కమిటీలో వెస్ట్ జోన్ కి చెందిన ఇద్దరు ఉండటంతో అందులో ఒకరిని తప్పించి, కొత్త వారికి అవకాశం కల్పించారు. మరి వెళ్లేవారెవరు? వచ్చేవారెవరంటే.. సెలెక్టర్ సలీల్ అంకోలా వెళుతున్నారు. ఆయన ప్లేస్ లో అజయ్ రాత్రా వస్తున్నారని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
టీమిండియా ఛీప్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సలీల్ అంకోలా ఇద్దరూ వెస్ట్ జోన్‌కు చెందినవారే కావడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చిందని తెలిపింది. అందుకే అజయ్ రాత్రాను ఎంపిక చేశామని, ఆయన నార్త్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారని వివరించింది.
Also Read: పారాలింపిక్స్.. 20 పతకాలతో భారత్ జోరు
మరిన్నాళ్లు బీసీసీఐ ఏం చేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు వెస్ట్ జోన్ సెలక్టర్లను పెట్టి, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు అన్యాయం చేశారా? అని అప్పుడే మండిపడుతున్నారు. ఈ రాజకీయాలు ఉన్నంత కాలం బీసీసీఐని ఎవడూ కాపాడలేడని దుయ్యబడుతున్నారు.
ఇకపోతే కొత్తగా సెలక్షన్ కమిటీ సభ్యుడైన అజయ్ రాత్రా హర్యానా వాసి. భారత్ తరఫున 6 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. 12 వన్డేలు ఆడాడు. 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి, 4 వేల పరుగులు చేశాడు. వికెట్ కీపర్ గా 200 డిస్‌మిసల్స్‌లో భాగమయ్యాడు
2023 సౌతాఫ్రికా పర్యటనలో టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్‌గా వ్యవహరించాడు. అన్నింటికి మించి తను అస్సామ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ జట్లకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. తన రాకతో భారత క్రికెట్ కు మేలు చేసే మెరికల్లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.